Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

ప్రభుత్వ విద్యలో సంస్కరణలు వేగవంతం

September 12, 2026 తెలంగాణ

ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి పలు కీలక సంస్కరణలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో మాట్లాడిన ఆయన, ప్రైవేటు విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు ఆకర్షితులు కావడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. చిన్న వయసులోనే పిల్లలకు విద్య అందించే విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా వ్యవస్థలో రెండున్నరేళ్ల వయసు నుంచే పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారని, అయితే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్ల తర్వాత మాత్రమే పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తున్న పరిస్థితి గతంలో ఉండేదని సీఎం వివరించారు. నర్సరీ, ఎల్‌కేజీ విధానాలతో పాటు ఇంగ్లీష్ భాషా బోధనకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని ప్రారంభించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 64 వేల మంది చిన్నారులు ప్రీ ప్రైమరీ విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. చిన్న వయసులోనే నాణ్యమైన విద్య అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచడమే లక్ష్యమన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు పోషకాహారంతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి తోడ్పడుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో సెంట్రలైజ్డ్ కిచెన్లను రూపొందించి పరిశుభ్రమైన, నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ మరియు భోజనాన్ని అందిస్తున్నామని సీఎం చెప్పారు. హైజీనిక్ విధానంలో తయారైన ఆహారం విద్యార్థులకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు విద్యా ఫలితాలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.