Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

హైదరాబాద్–బీజాపూర్ హైవే పనుల పరిశీలన

August 31, 2026 జనరల్

వికారాబాద్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. చేవెళ్ల సమీపంలోని మల్కాపూర్ వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులు వివరించగా, పనుల నాణ్యత, వేగంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోడ్డు మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ, ఆధునికీకరణ ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమలు, వ్యాపార రంగాలకు కూడా ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య దూరాలు తగ్గి ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత సులభతరం అవుతుందని చెప్పారు. హైదరాబాద్–బీజాపూర్ హైవే అభివృద్ధి పూర్తయితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత వేగవంతం అవుతాయని, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. రహదారి నిర్మాణ పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.