ఏఐతో బోనాల భద్రత
హైదరాబాద్, ఆగస్టు 2 : ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనర్, భాగ్యనగరంలో బోనాల పండుగకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందన్నారు. గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగియగా, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయని తెలిపారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు అనుసంధానంగా ముఖ గుర్తింపు సాంకేతికతను వినియోగిస్తున్నామని సీపీ చెప్పారు. దీని ద్వారా పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, క్యూలైన్లలో రద్దీని ఏఐ సాయంతో విశ్లేషించి పరిమితికి మించి జనసమ్మర్థం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకుని తొక్కిసలాటలు జరగకుండా చూస్తామని తెలిపారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పనిచేస్తున్నామని సీపీ సజ్జనర్ పేర్కొన్నారు. భక్తులు పోలీసు శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ కుమార్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.






