Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

అనయకు అనుమతి.. కాప్‌ అభ్యంతరం

August 29, 2026 జనరల్

ముంబై : లింగ మార్పిడి అనంతరం క్రికెట్‌లో కొనసాగేందుకు సిద్ధమైన అనయ బంగర్‌ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ స్థాయి క్రికెట్‌లో ఆడేందుకు అనయకు అనుమతి లభించినట్లు వార్తలు రావడంతో దక్షిణాఫ్రికా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మారిజాన్‌ కాప్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళల క్రికెట్‌లో అనయకు అవకాశం ఇవ్వడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
అనుమతిపై తీవ్ర స్పందన
క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి అనయకు అనుమతి లభించినట్లు వచ్చిన వార్తను కాప్‌ సామాజిక మాధ్యమంలో పంచుకుంది. ‘ఇది పూర్తిగా హాస్యాస్పదం. అనయ బంగర్‌ క్రికెట్‌ ఆడేందుకు అసలు అనుమతి ఇవ్వకూడదు’ అంటూ ఘాటుగా స్పందించింది. మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌ అధికారిక ఖాతాను కూడా తన పోస్టులో పేర్కొంది.
ముంబై, ఇంగ్లండ్‌లోనూ ఆట
లింగ మార్పిడికి ముందు అనయ పురుషుల క్రికెట్‌లోనూ ఆడింది. ముంబై తరఫున పలు స్థాయిల క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌, ముషీర్‌ ఖాన్‌లతో కలిసి ఆడిన అనుభవం ఆమెకు ఉంది. ఇంగ్లండ్‌లో క్లబ్‌ క్రికెట్‌లోనూ పాల్గొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్‌కు అనుమతి లభించడంతో ఆమెకు భవిష్యత్తులో ఉన్నత స్థాయి మహిళల క్రికెట్‌లో అవకాశం దక్కుతుందా? అనే చర్చ మొదలైంది.
మహిళల క్రికెట్‌పై చర్చ
కమ్యూనిటీ స్థాయి క్రికెట్‌లో ఆడేందుకు లభించిన అనుమతి.. ఉన్నత స్థాయి మహిళల క్రికెట్‌కు నేరుగా అర్హత కల్పించదు. అయితే అనయకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు లభిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడే అవకాశం వస్తుందా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. కాప్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.