Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

పశువుల కొట్టంలోకి పులి.. ఆవు మృతి! బసిరెడ్డిపల్లి పరిసరాల్లో భయం.. దూడను ఎత్తుకెళ్లినట్లు స్థానికుల అనుమానం

సీసీ కెమెరాల్లో కదలికలు... పులిని పట్టుకోవాలని డిమాండ్‌
SAI MANIKANTA
September 27, 2026 · 2 days క్రితం
◉ 14 Views ↗ 1 Shares
వికారాబాద్‌, సెప్టెంబర్‌ 27 (నవజ్యోతి ప్రతినిధి):

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి పరిసర గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందన్న సమాచారంతో భయాందోళన నెలకొంది. కృష్ణగిరి క్షేత్రం సమీపంలోని ఓ పశువుల కొట్టంలోకి పులి ప్రవేశించి పశువులపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఓ ఆవు మృతి చెందినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం.. ఆవు మెడ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలున్నాయి. పశువుల కొట్టం వద్ద ఉన్న సంరక్షకుడు అప్రమత్తమై కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

మూడు రోజుల క్రితం దూడ అదృశ్యం?
మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ దూడను పెద్దపులి ఎత్తుకెళ్లినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులిని పోలిన జంతువు కదలికలు నమోదైనట్లు వారు చెబుతున్నారు.

ప్రస్తుతం పశువుల కొట్టంలో సుమారు 200 వరకు పశువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో పశువులు ఉన్న ప్రాంతంలో పెద్దపులి సంచారం కొనసాగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాంతంలో గాలింపు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పులి కదలికలను గుర్తించేందుకు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పులిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పశువులపై దాడి చేసింది నిజంగా పెద్దపులేనా? సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు ఏదన్నది అటవీశాఖ అధికారులు పరిశీలించి నిర్ధారించాల్సి ఉంది.

ప్రజలకు సూచన:
పెద్దపులి లేదా ఇతర వన్యప్రాణి సంచారం ఉన్నట్లు అనుమానం ఉంటే ఒంటరిగా బయటకు వెళ్లకండి. పశువులను బహిరంగ ప్రదేశాల్లో కట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram