కొరియర్ మార్గంలో బంగారం స్మగ్లింగ్.. భారీ ముఠా గుట్టురట్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 (నవజ్యోతి ప్రతినిధి): దేశవ్యాప్తంగా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న భారీ నెట్‌వర్క్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు ఛేదించారు. వివిధ ప్రాంతాల్లో సమన్వయంతో చేపట్టిన చర్యల్లో సుమారు 6.6 కిలోల విదేశీ మూలాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసులో ముఠా సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తితో సహా మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో కొరియర్ మార్గాలను ఉపయోగించి విదేశీ బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో ఈ నెట్‌వర్క్ ద్వారా సుమారు 318 కిలోల బంగారం అక్రమంగా రవాణా జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. దాని విలువ సుమారు రూ.475 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. బంగారం సరఫరా, పంపిణీ కోసం ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, అనుబంధ నెట్‌వర్క్‌ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అరెస్టయిన వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా అక్రమ రవాణా వ్యవస్థలోని ఇతర సంబంధాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.






