న్యూ జనరేషన్ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
మిర్యాలగూడ, నవంబర్ 14 (నవజ్యోతి ప్రతినిధి) న్యూ జనరేషన్ హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అనంతుల సోమయ్య, డైరెక్టర్ పెద్దింటి నాగయ్యలు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను, విద్యార్థుల జీవితంలో విద్య, క్రమశిక్షణ, సృజనాత్మకత యొక్క ప్రాధాన్యతను వివరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంప్రదాయ వస్త్రధారణలో అలరించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతీయ సంస్కృతిని తమ వేషధారణల ద్వారా చాటిచెప్పారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.






