రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా మెలగాలి
కాటారం, నవంబర్ 26 (నవజ్యోతి ప్రతినిధి): భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తోందని గుండ్రాత్పల్లి గ్రామ సర్పంచ్ తోటపల్లి సావిత్రి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గుండ్రాత్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుల, మత, ప్రాంత, వర్గ భేదాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించడం రాజ్యాంగం గొప్పతనమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు పౌరులు తమ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రాథమిక సూత్రాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిబింబించాలని, భావితరాలకు రాజ్యాంగ విలువలు, ఆశయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా మహిళలు రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెనగంటి సారక్క, తోటపల్లి భవాని, సంతోషం ప్రేమలత, బండం విజయ, కమ్మగోని సులోచన, పోటు వనిత, తోటపల్లి సంధ్యారాణి, పున్నం పద్మ, సంతోషం రమాదేవి, తాళ్లపెల్లి సారక్క, తోటపల్లి లక్ష్మి, తోటపల్లి పోసక్క, నాగునూరి రాజాగౌడ్, సెలవోజు స్వామి, మధుకర్, జనగాం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.






