కొడకండ్ల రాజీవ్ రహదారిపై అంధకారం.. పట్టించుకోని అధికారులు
హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిపై కొడకండ్ల గ్రామoలో హైమాక్స్, ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాత్రివేళ చీకట్లు అలుముకుంటున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై వెలుగులు లేక పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించకముందే ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి దీపాలకు మరమ్మతులు చేసి, కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామం మీదగా వెళ్ళే రహదారి అనేక మూలమలుపులు ఉండడం వల్ల నిరంతరం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు వాహనాలు విద్యుత్ స్తంభాలను ఢీకొడితే మరికొన్ని పెద్ద పెద్ద వాహనాలు ఇండ్లలోకే నేరుగా వచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి కూడా ఒక కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నుజ్జు నుజ్జు అయ్యింది. దానితో పాటు గురువారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. మరో ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.






