కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 24 (నవజ్యోతి ప్రతినిధి): సుచిత్ర సర్కిల్ సమీపంలోని టీఎన్‌ఆర్ (సినీపోలిస్) మల్టీప్లెక్స్‌లో గురువారం రాత్రి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రదర్శన సందర్భంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. స్క్రీన్–4లో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన షో.. మైనర్ల ప్రవేశంపై తలెత్తిన వివాదంతో ఆలస్యమైనట్లు తెలిసింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన నేపథ్యంలో 18 ఏళ్లలోపు వారికి థియేటర్‌లో ప్రవేశం ఉండదు. అయితే స్క్రీన్‌లో మైనర్లు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి, లోపల ఉన్న మైనర్లను బయటకు పంపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు పోలీసుల చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
టికెట్లు జారీ చేసే సమయంలోనే వయస్సు నిబంధనలు ఎందుకు అమలు చేయలేదంటూ తల్లిదండ్రులు ప్రశ్నించినట్లు సమాచారం. టికెట్ ఇచ్చిన తర్వాత థియేటర్‌లోకి అనుమతించి, సినిమా ప్రారంభానికి ముందు మైనర్లను బయటకు పంపే ప్రయత్నం చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రేక్షకుల మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
మరోవైపు ‘ఎ’ సర్టిఫికెట్ ఉన్న సినిమాకు సంబంధించి వయస్సు నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? టికెట్ విక్రయించే సమయంలోనే వయస్సు నిర్ధారణ జరిగిందా? ప్రవేశ ద్వారం వద్ద తనిఖీలు ఎందుకు చేపట్టలేదు? అనే ప్రశ్నలు తలెత్తాయి. టికెట్ విక్రయం నుంచి ప్రేక్షకుల ప్రవేశం వరకు నిబంధనలు అమలయ్యాయా లేదా అన్నదానిపై స్పష్టత అవసరమని పలువురు పేర్కొన్నారు.
షో నిలిచిపోయి.. ప్రేక్షకుల ఇబ్బందులు
వివాదం, పోలీసుల తనిఖీల నేపథ్యంలో సినిమా ప్రదర్శన గంటకు పైగా ఆలస్యమైనట్లు సమాచారం. దీంతో థియేటర్ ఆవరణలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు, మల్టీప్లెక్స్ సిబ్బంది ప్రేక్షకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
‘ఎ’ సర్టిఫికెట్ నిబంధనలు ముందుగానే తెలిసినప్పటికీ.. టికెట్ విక్రయం, వయస్సు నిర్ధారణ, ప్రవేశ తనిఖీల దశల్లో స్పష్టమైన అమలు ఎందుకు జరగలేదన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మైనర్ల ప్రవేశంపై ముందస్తు తనిఖీలు చేపట్టి ఉంటే ఈ వివాదం, షో ఆలస్యం వంటి పరిస్థితులు తలెత్తేవి కావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.