Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నేర వార్తలు

బీహార్‌లో మరో దారుణం.. యువతిపై వేధింపులు!

రోడ్డుపై చుట్టుముట్టి దుర్భాషలు.. అడ్డొచ్చిన యువకుడిపైనా దాడి వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన పోలీసులు.. ఐదుగురు అరెస్ట్‌
SAI MANIKANTA
September 24, 2026 · 5 days క్రితం
◉ 17 Views ↗ 1 Shares
బీహార్‌, సెప్టెంబర్‌ 24 (నవజ్యోతి ప్రతినిధి):

బీహార్‌లో జముయ్‌ ఘటన మరువకముందే మరో వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్‌ జిల్లాలోని జగత్‌సింగ్‌పూర్‌ గ్రామంలో ఓ యువతిని కొందరు యువకులు రోడ్డుపై చుట్టుముట్టి దుర్భాషలాడుతూ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. యువతితో ఉన్న యువకుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపైనా దాడికి పాల్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

స్థానికుల సమాచారం ప్రకారం.. యువతి, ఆమెతో ఉన్న యువకుడు గ్రామీణ రహదారిపై ఫొటోలు తీసుకునేందుకు ఆగారు. అదే సమయంలో బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు వారిని అడ్డుకుని చుట్టుముట్టారు. యువతిని దుర్భాషలాడుతూ రోడ్డుపైకి నెట్టివేస్తూ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువకుడిపై కూడా దాడి చేసినట్లు వీడియోలో నమోదైంది.

వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు దృష్టిసారించారు. ఘటన జరిగిన ప్రాంతం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల వివరాలను నిర్ధారిస్తున్నామని పోలీసు అధికారి అరవింద్‌ ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. ఈ కేసులో తాజాగా ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

జముయ్‌లోనూ ఇదే తరహా ఘటన

కొద్ది రోజుల క్రితం ఇద్దరు పదో తరగతి విద్యార్థులను కొందరు వ్యక్తులు అడ్డుకుని వేధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం జముయ్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు వేధింపులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోచింగ్‌ క్లాసులు ముగించుకుని స్కూటర్‌పై వెళ్తున్న వారిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. యువకుడి షర్ట్‌ కాలర్‌ పట్టుకుని అతడిని యువతి నుంచి దూరంగా లాగినట్లు, యువతి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి ఆమెను వెనుక నుంచి పట్టుకున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

యూపీలో మరో కలకలం.. పోలీసులపై అత్యాచార ఆరోపణలు
మతపరమైన ప్రాంతాలు చూపిస్తామంటూ యువతిని తీసుకెళ్లినట్లు ఆరోపణలు

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోనూ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మతపరమైన ప్రాంతాలను చూపిస్తామంటూ హర్యానాకు చెందిన 24 ఏళ్ల యువతిని అమ్రోహాకు తీసుకెళ్లి ఓ ఫామ్‌హౌస్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇద్దరు యూపీ పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 20న ఫతేహాబాద్‌కు చెందిన యువతిని ఓ మహిళా పరిచయస్తురాలు సంప్రదించి, అమ్రోహాలోని మతపరమైన ప్రాంతాలను సందర్శించేందుకు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మోహిత్‌ను కలవాలని సూచించింది. సెప్టెంబర్‌ 21న సోనిపట్‌లో మోహిత్‌ను కలిసిన యువతి అతడితో కలిసి మీరట్‌కు వెళ్లింది. అక్కడ సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ లాలారామ్‌ యాదవ్‌ వారితో చేరినట్లు పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్‌ 22న ఇద్దరూ కారులో యువతిని హసన్‌పూర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో యూపీ పోలీస్‌ ఎస్‌ఐ సంజయ్‌ తోమర్‌ను ఎక్కించుకున్నట్లు సమాచారం. అనంతరం అట్రాసి-హసన్‌పూర్‌ రహదారిలోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి రెండు గదులు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తనపై మోహిత్‌, లాలారామ్‌, సంజయ్‌ అత్యాచారానికి పాల్పడ్డారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ అక్కడికి ఆహారం, మద్యం తీసుకొచ్చినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అనంతరం ప్రమోద్‌ కూడా అత్యాచారానికి ప్రయత్నించగా అతడిని బయటకు నెట్టేసి తలుపు వేసుకున్నట్లు యువతి తెలిపింది.

అనంతరం ఆన్‌లైన్‌లో పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ కోసం వెతికిన యువతి బుధవారం ఉదయం సుమారు 6 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. హసన్‌పూర్‌, రాజబ్‌పూర్‌ పోలీసులు ఫామ్‌హౌస్‌కు చేరుకుని యువతిని రక్షించి నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై యూపీ ఎస్‌ఐ సంజయ్‌ తోమర్‌ను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగినట్లు ఆరోపిస్తున్న ఫామ్‌హౌస్‌ ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ స్వతంత్ర ఎమ్మెల్యేకు చెందినదిగా పోలీసులు చెబుతున్నారు. కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram