ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ప్రచురించిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ కావడంతో.. దాని పనితీరుపై వచ్చిన ఆరోపణలు, సందేహాలపై నిష్పక్షపాత విచారణ జరిపే విశ్వసనీయత సుప్రీంకోర్టుకు మాత్రమే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయని, తాజాగా వెలువడిన కథనం వాటిని మరింత పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ తన కథనంలో పేర్కొంది. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణకు సంబంధించిన కొన్ని నిర్ణయాలపై వారు ప్రశ్నలు లేవనెత్తినట్లు కథనం తెలిపింది. 0
కేటీఆర్ ఏమన్నారంటే..
ఎస్ఐఆర్పై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని సుమోటో విచారణ చేపట్టాలని కేటీఆర్ కోరారు. విచారణ ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్ఐఆర్పై తాము గతంలోనూ ఎన్నికల సంఘం దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లామని కేటీఆర్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, స్పష్టత అవసరమని కోరినట్లు చెప్పారు. ఈ అంశాలపై అనుమానాలు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. 1
అయితే ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలకు స్పందించింది. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు, సూచనలు సంస్థాగత నిర్ణయ ప్రక్రియలో సాధారణ భాగమేనని పేర్కొంది. గత ఏడాది కాలంలో ఎస్ఐఆర్తో సహా కీలక నిర్ణయాలన్నీ పూర్తి కమిషన్ ఏకగ్రీవంగా తీసుకున్నాయని ఈసీ స్పష్టం చేసింది. 2
ఇదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి పలు అంశాలు సుప్రీంకోర్టు ముందూ ఉన్నాయి. సెప్టెంబర్ 22న ఢిల్లీ ఎస్ఐఆర్లో ఓటర్లకు పంపిన కొన్ని నోటీసులు యాంత్రికంగా జారీ చేసినట్లుగా కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటర్లు వాటికి వాట్సాప్, ఈమెయిల్ ద్వారా స్పందించే అవకాశాలపై కూడా కోర్టు సూచనలు చేసింది. 3