Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

హైదరాబాద్‌లో యూపీఐ లావాదేవీలు.. రూ.91,800 కోట్లు!

ఎండీఆర్‌తో వ్యాపారాలపై ప్రభావం పడుతుందన్న కాంగ్రెస్‌..చిన్న వ్యాపారులకు రూ.లక్ష నెలవారీ మినహాయింపు పరిమితిపైనా అభ్యంతరం
SAI MANIKANTA
September 23, 2026 · 6 days క్రితం
◉ 7 Views ↗ 1 Shares

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (నవజ్యోతి ప్రతినిధి): యూపీఐ చెల్లింపులపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)పై టీపీసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో జూలై నెలలో అన్ని రకాల యూపీఐ మార్గాల ద్వారా దాదాపు రూ.91,800 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి సయ్యద్‌ నిజాముద్దీన్‌ తెలిపారు. ఎంపిక చేసిన అధిక విలువైన లావాదేవీలపై ఎండీఆర్‌ భారం వ్యాపార రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 2

జూలైలో హైదరాబాద్‌ జిల్లాలో సుమారు రూ.24,939 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.35,119 కోట్లు, మేడ్చల్‌-మల్కాజిగిరిలో రూ.31,748 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు నిజాముద్దీన్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ చెల్లింపులు కీలకంగా మారిన నేపథ్యంలో కొత్త ఎండీఆర్‌ విధానం హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉందన్నారు.

రూ.2 వేలపైనే ఎండీఆర్‌.. కేంద్రం ఏం చెబుతోంది?
కేంద్రం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం ఎంపిక చేసిన పర్సన్‌-టు-మర్చంట్‌ (P2M) యూపీఐ లావాదేవీల్లో రూ.2,000కుపైబడిన వాటికి 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. రూ.75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంది. వ్యక్తి-వ్యక్తి (P2P) లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్‌ ఉండదు. సుమారు 96 శాతం P2M లావాదేవీలు కూడా ప్రభావితం కావని కేంద్రం చెబుతోంది. 3

అయితే లావాదేవీల సంఖ్య ఆధారంగా 96 శాతం ప్రభావితం కావని చెప్పడం కంటే.. ఎండీఆర్‌ వర్తించే లావాదేవీల మొత్తం విలువ ఎంతన్నది కూడా వెల్లడించాలని టీపీసీసీ డిమాండ్‌ చేసింది. తక్కువ మార్జిన్‌తో పనిచేసే వ్యాపారులకు అధిక విలువైన లావాదేవీలపై అదనపు ఖర్చు ప్రభావం చూపవచ్చని నిజాముద్దీన్‌ పేర్కొన్నారు. 4

సరఫరా గొలుసుపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఉదాహరణకు టీ దుకాణంలో రూ.50 చెల్లింపు ఎండీఆర్‌ పరిధిలోకి రాకపోయినా.. అదే వ్యాపారి పాలు, చక్కెర, గ్యాస్‌ వంటి సరుకులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే సమయంలో ఎండీఆర్‌ వర్తిస్తే ఆ అదనపు ఖర్చు వ్యాపార నిర్వహణపై ప్రభావం చూపవచ్చని ఆయన వాదించారు.

బేగంబజార్‌, లాడ్‌బజార్‌, పాతేర్‌గట్టి వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాలతోపాటు వస్త్ర, హోటల్‌, పర్యాటక రంగాల్లో అధిక విలువైన లావాదేవీలు జరుగుతాయని.. అక్కడ తక్కువ మార్జిన్‌తో వ్యాపారం చేసే వారికి ఎండీఆర్‌ అంశం ప్రాధాన్యంగా మారుతుందని టీపీసీసీ పేర్కొంది. 5

చిన్న వ్యాపారుల మినహాయింపుపై ప్రశ్న
చిన్న వ్యాపారులకు నెలకు రూ.లక్ష వరకు యూపీఐ రసీదులపై మినహాయింపు పరిమితిని కూడా టీపీసీసీ ప్రశ్నించింది. మొత్తం టర్నోవర్‌ను నికర లాభంతో సమానం చేయకూడదని, ఎక్కువ టర్నోవర్‌ ఉన్నా తక్కువ మార్జిన్‌తో పనిచేసే వ్యాపారులు ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.

ఎండీఆర్‌ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీపీసీసీ డిమాండ్‌ చేసింది. ఎండీఆర్‌ వర్తించే 4 శాతం లావాదేవీల మొత్తం ద్రవ్య విలువ ఎంతన్నదానిపై కేంద్రం పూర్తి వివరాలు వెల్లడించాలని, సూక్ష్మ, చిన్న, సంప్రదాయ వ్యాపారులకు ఆర్థిక రక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. 6

యూపీఐ ఎండీఆర్‌ అనేది వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసే పన్ను కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చెల్లింపుల వ్యవస్థలోని భాగస్వాముల మధ్య పంచుకునే రుసుమని, వినియోగదారులపై అదనపు ఛార్జీ ఉండదని పేర్కొంది. మరోవైపు ఈ ఖర్చు చివరకు వ్యాపారులపై, సరఫరా గొలుసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ప్రధాన ప్రశ్నగా ఉందని టీపీసీసీ వాదిస్తోంది. 7

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram