తూప్రాన్, సెప్టెంబర్ 23 (నవజ్యోతి ప్రతినిధి): ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై సమీక్షించాల్సిన మండల స్థాయి సమావేశం.. అధికారుల తీరుతోనే చర్చనీయాంశంగా మారింది. తూప్రాన్‌లో జడ్పీ సీఈఓ ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కావాల్సి ఉండగా.. సుమారు రెండు గంటలకు ప్రారంభమైనట్లు సమాచారం. దీంతో సమావేశ నిర్వహణలో సమయపాలన ఎక్కడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సమావేశం ప్రారంభమైన తర్వాత ఉన్నతాధికారి ఎల్లయ్య మాట్లాడుతుండగా.. కొందరు అధికారులు సెల్‌ఫోన్లలో నిమగ్నమై కనిపించారు. మరికొందరు పక్కనే కూర్చొని పరస్పరం మాట్లాడుకుంటూ కనిపించారు. ఉన్నతాధికారి ఏం చెబుతున్నారు? తమ శాఖకు సంబంధించిన అంశాలపై ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అనే విషయాలను గమనించాల్సిన సమయంలో ఈ తీరు కనిపించడం సమావేశంలో అధికారుల ఏకాగ్రతపై ప్రశ్నలు రేకెత్తించింది.
ఒకవైపు సమయానికి సమావేశం ప్రారంభం కాకపోవడం.. మరోవైపు సమావేశం మొదలైన తర్వాత కొందరు అధికారులు ఫోన్లలో, మరికొందరు తమ సంభాషణల్లో నిమగ్నమవడం చర్చకు దారితీసింది. అత్యవసర అధికారిక అవసరాల కోసం ఫోన్ వినియోగించి ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. పలువురు ఒకేసారి ఫోన్లలో కనిపించడం, ఇంకొందరు మాట్లాడుకోవడం మాత్రం సమావేశంలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది.
సమయపాలనపై పాఠాలు చెప్పేది ఎవరు?
ప్రజలకు సమయపాలన, బాధ్యత, క్రమశిక్షణపై సూచనలు చేసే అధికారులే తమ సమావేశాలను నిర్ణయించిన సమయానికి ప్రారంభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం రెండు గంటలకు ప్రారంభమైతే.. దాదాపు గంట సమయం ఎందుకు ఆలస్యమైందన్న ప్రశ్నకు సమావేశ నిర్వాహకులే సమాధానం చెప్పాల్సి ఉంది.
మండల స్థాయి సమీక్షా సమావేశాలు కేవలం హాజరు నమోదు కోసం నిర్వహించేవి కావు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల పురోగతి, శాఖల పనితీరు, పెండింగ్ అంశాలపై సమీక్షించి.. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఇవి కీలక వేదికలు.
ఉన్నతాధికారి మాట్లాడుతుంటే.. కొందరు ఫోన్లలో ఏం చూస్తున్నారు? మరికొందరు ఏం మాట్లాడుకుంటున్నారు? సమయానికి ప్రారంభం కావాల్సిన సమావేశం గంట ఆలస్యమవడానికి కారణమేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే సమీక్షా సమావేశాల్లో ముందుగా అధికారులే సమయపాలన, క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమావేశానికి హాజరుకావడం మాత్రమే కాకుండా.. ఉన్నతాధికారుల సూచనలు శ్రద్ధగా వినడం, శాఖల వారీగా స్పందించడం, నిర్ణయించిన సమయానికి కార్యక్రమాలను ప్రారంభించడం వంటి అంశాలపైనా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.