Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

పోరాడితే పోయేదేమీలేదు.. బానిస సంకెళ్లు తప్పా!

జూరాల నీటి విడుదలపై కేటీఆర్‌ స్పందన..రైతుల పోరాటం స్ఫూర్తిదాయకమన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
SAI MANIKANTA
September 23, 2026 · 6 days క్రితం
◉ 8 Views ↗ 1 Shares

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (నవజ్యోతి ప్రతినిధి): జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయడంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. నీటి కోసం రైతులు చేసిన పోరాటాన్ని ఆయన అభినందించారు. రైతులు తమ హక్కుల కోసం సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

బుధవారం జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. రైతుల ఆందోళనలు, కర్ణాటక నుంచి కృష్ణా జలాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల నేపథ్యంలో ఈ చర్య చోటుచేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు మంగళవారం సమావేశమై జూరాలకు నీటి విడుదలపై విజ్ఞప్తి చేశారు. 1

ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. “పోరాడితే పోయేదేమీలేదు.. బానిస సంకెళ్లు తప్పా” అని పేర్కొన్నారు. జూరాల నుంచి నీరు అందక పొలాలు ఎండిపోతున్న సమయంలో రైతులు తమ హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.

రైతుల ఆందోళనతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించిన కేటీఆర్‌.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టి పరుగులు పెట్టించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని రైతులను ఉద్దేశించి పేర్కొన్నారు.

జూరాల నీటి కోసం రైతుల పోరాటంలో కలిసి నడిచిన బీఆర్‌ఎస్‌ నాయకులకు కూడా కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల కనీస అవసరాలు తీరేలా పోరాడటమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు.

ప్రశ్నించడం, పోరాడడం, తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే ఎవరితోనైనా పోరాడడం తమ ముందున్న లక్ష్యమని కేటీఆర్‌ అన్నారు. తన ఎక్స్‌ పోస్టును “జై కేసీఆర్‌.. జై తెలంగాణ” అంటూ ముగించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram