హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నవజ్యోతి ప్రతినిధి):
హీరో నాని తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను అభిమానుల మధ్య కూర్చొని వీక్షించాలని ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సెప్టెంబర్ 23న జరిగే ప్రీమియర్ షోకు సాధారణ ప్రేక్షకులతో కలిసి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
సినిమా అంటే చిన్నప్పటి నుంచే తనకు ఎంతో ఇష్టమని నాని పేర్కొన్నారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటంలో ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందని, ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడటం తనకు ఎప్పటికీ ప్రత్యేక అనుభవమేనని తెలిపారు. తాను నటించిన ‘ది ప్యారడైజ్’ను కూడా అక్కడ ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాలని ఉందని ఆయన పేర్కొన్నారు.
సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని నాని అన్నారు. అదే సమయంలో అన్ని భద్రతా నిబంధనలు, అవసరమైన ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటిస్తామని, భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
నాని అప్పీల్‌కు సీఎం స్పందన: నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 23 ఉదయం ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ నాని చేసిన విజ్ఞప్తిని ప్రశంసించారు. ప్రతిభావంతుడైన యువ తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంపై నాని చూపిస్తున్న నిబద్ధతను అభినందించారు.
అభిమానుల రద్దీని సజావుగా నిర్వహించడంతోపాటు ప్రజల భద్రతను నిర్ధారించేందుకు సంబంధిత స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ మేరకు డీజీపీని కూడా సీఎం ట్యాగ్ చేశారు.
ఇప్పటికే ప్రత్యేక ప్రీమియర్‌కు అనుమతి: ‘ది ప్యారడైజ్’ చిత్రానికి తెలంగాణలో సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గతంలో చోటుచేసుకున్న భారీ అభిమానుల రద్దీ, భద్రతా పరిస్థితుల నేపథ్యంలో స్టార్ హీరోలు స్వయంగా థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో కలిసి సినిమా చూసే సందర్భాలు కొంతకాలంగా తగ్గిపోయాయి.
ఈ నేపథ్యంలో సాధారణ ప్రేక్షకులతో కలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ చూడాలన్న నాని కోరిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం సూచన మేరకు నాని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకుంటారా? దానిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.