బియ్యం ధర వింటేనే భయం..
మిర్యాలగూడ, నవంబర్ 9 (నవజ్యోతి ప్రతినిధి) బియ్యం ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ కొందరు రైస్ మిల్లర్లు ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతుల నుంచి క్వింటా ధాన్యాన్ని సుమారు రూ.2,300 చొప్పున కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు, అదే ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రస్తుతం క్వింటా బియ్యాన్ని రూ.10 వేల వరకు విక్రయించడం అన్యాయమని విమర్శించారు. ఎల్నినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ కృత్రిమ కొరత సృష్టించి, బియ్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని మండిపడ్డారు. మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లుల్లో వేలాది బస్తాల ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ, పాత బియ్యం పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు తుపాను వంటి ప్రకృతి విపత్తులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మానవీయ కోణంలో ఆలోచించాల్సిన వ్యాపారులు ధరలను పెంచడం సరైన విధానం కాదన్నారు. వానాకాలం సీజన్లో రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ, బియ్యాన్ని మాత్రం అధిక ధరలకు విక్రయించడం ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలను అవకాశంగా మలుచుకొని వందల కోట్ల రూపాయలతో భారీ రైస్ మిల్లులు నిర్మిస్తున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. బియ్యం ధరలు నియంత్రణలో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, దేశీయ అవసరాలు తీరే వరకు బియ్యం విదేశాలకు ఎగుమతి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






