హోటల్ గదిలో వైద్య విద్యార్థిని దారుణ హత్య!
హైదరాబాద్ మియాపూర్‌లో వైద్య విద్యార్థిని కోమటి సృజన (27) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌కు చెందిన సృజన మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, హనుమకొండలో పీజీ చదువుతున్నట్లు సమాచారం. ఓ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యురాలిగా కూడా పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన క్యాబ్ డ్రైవర్ రవికుమార్ (30)తో సృజనకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు సమాచారం. అయితే రవికుమార్ సరిగా పనిచేయకపోవడంతో అప్పులు చేసినట్లు, ఆ అప్పులు తీర్చేందుకు సృజన వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెప్టెంబర్ 29న రవికుమార్ తన స్నేహితుడితో కలిసి మార్తాండ్‌నగర్, న్యూ హఫీజ్‌పేట్‌లోని గ్రాండ్ బ్రోహోలిక్ లగ్జరీ హోటల్‌లో గది తీసుకున్నట్లు సమాచారం. మరుసటి రోజు స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం రవికుమార్ సృజనకు ఫోన్ చేసి మాట్లాడుకుందామని, ఆమెకు ఇవ్వాల్సిన బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పి హైదరాబాద్‌కు రావాలని కోరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దీంతో సెప్టెంబర్ 30న సృజన హైదరాబాద్‌కు వచ్చి హోటల్ గదికి వెళ్లినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఇద్దరి మధ్య ఏదైనా వివాదం జరిగి ఉండవచ్చని, ఆ సమయంలో సృజన నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు ఖచ్చితమైన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
సృజన హైదరాబాద్‌కు వెళ్లి బంగారు ఆభరణాలు తీసుకుని తిరిగి వస్తానని ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో స్నేహితులు ఈ విషయాన్ని తండ్రి భూమయ్యకు తెలిపారు. దీంతో ఆయన హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
సృజన మొబైల్ ఫోన్ లొకేషన్‌ను పరిశీలించిన పోలీసులు అది మార్తాండ్‌నగర్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని హనుమకొండ పోలీసులు మియాపూర్ పోలీసులకు అందించారు. పోలీసులు హోటల్‌కు చేరుకుని గదిని పరిశీలించగా తలుపు బయట నుంచి లాక్ చేసి ఉన్నట్లు గుర్తించారు.
మరో తాళంతో గది తెరిచి చూడగా సృజన మంచంపై మృతిచెంది కనిపించింది. హోటల్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు సృజన – రవికుమార్ కలిసి హోటల్‌లోకి వెళ్లిన దృశ్యాలు, అనంతరం రవికుమార్ కదలికలు కనిపించినట్లు సమాచారం. దీంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రవికుమార్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం సృజన మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.






