మాడుగులపల్లి మండల అభివృద్ధికి పెద్దపీట!
ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మాడుగులపల్లి మండలం చెర్వుపల్లి గ్రామంలో మాడుగులపల్లి నుంచి తిప్పలమ్మగూడెం ఎక్స్‌రోడ్డు వరకు రూ.35 కోట్ల వ్యయంతో రహదారిని విస్తరించి, పటిష్టపరిచే పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా రూ.200 కోట్ల వ్యయంతో 220 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని కోరారు. చెర్వుపల్లి గ్రామానికి ఈ ఏడాది 25, వచ్చే ఏడాది మరో 50 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. చెర్వుపల్లి గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ నీటిని ఒడిసి పట్టుకోవాలని సూచించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని కోరారు.
రోడ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు – రైతులకు ప్రయాణ సౌకర్యం మరింత అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. రహదారి విస్తరణ – పటిష్టీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్డీఓ వై. అశోక్‌రెడ్డి, ఆర్అండ్బీ అధికారులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వడ్డే సైదిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పుల్లెంల సైదులు, సర్పంచ్ ఆరూరి నరేష్, దాచారం సర్పంచ్ బెల్లి జానయ్య, కొత్తగూడెం సర్పంచ్ కొత్త పద్మ ప్రభాకర్‌రెడ్డి, ఇందుగుల గ్రామ శాఖ అధ్యక్షులు కళ్లు శ్రీనివాస్‌రెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు – గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






