ప్రియుడిపై పోలీసుల అనుమానం.. గదిలో రక్తపు మరకలు...మరో ఘటనలో పెళ్లి వివాదంతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
SAI MANIKANTA
September 22, 2026 · 1 week క్రితం
◉ 73 Views↗ 1 Shares
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నవజ్యోతి ప్రతినిధి): మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మృతురాలిని విశాఖపట్నానికి చెందిన నిఖితగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆమెతో పాటు హోటల్‌కు వచ్చిన ప్రియుడు శ్రీనివాస రవితేజపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హోటల్ గదిలో గోడలు – బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన స్థలంలో ఖాళీ బీర్ – విస్కీ బాటిళ్లు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి ఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. యువతి మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన అనంతరం శ్రీనివాస రవితేజ అందుబాటులో లేకపోవడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యే వరకు మృతికి సంబంధించిన కారణంపై స్పష్టత రావాల్సి ఉంది.
పెళ్లి వివాదంతో మరో విషాదం
మలక్‌పేట పోలీసుల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ముత్తా చంద్రశేఖర్ (36) శాలివాహననగర్‌లోని డ్రీమ్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
ఇటీవల మంచిర్యాలకు చెందిన సమీప బంధువైన యువతితో చంద్రశేఖర్‌కు వివాహం నిశ్చయమైంది. కొద్ది రోజుల తర్వాత తనకు ఈ వివాహం ఇష్టం లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వివాహాన్ని రద్దు చేసుకున్నప్పటికీ, ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆదివారం అర్ధరాత్రి చంద్రశేఖర్ యువతికి వీడియో కాల్ చేసి తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు చెప్పిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువతి ఇచ్చిన సమాచారంతో మలక్‌పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వివాహానికి సంబంధించిన సమస్యలతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సంజీవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: మాదాపూర్ ఘటనలో యువతి మృతికి గల కారణం, ప్రియుడి పాత్రపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు అనుమానాలను నిర్ధారిత విషయాలుగా పరిగణించరాదు.
నవజ్యోతి తాజా వార్తలు మీకు వెంటనే కావాలా?
మా అధికారిక WhatsApp & Telegram Channels ను Follow అవ్వండి