హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎస్టీ రిజర్వేషన్ అర్హతపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన కుటుంబాలకు చెందిన అభ్యర్థులు తమ మూల రాష్ట్రాల్లో జారీ చేసిన ఎస్టీ ధ్రువపత్రాల ఆధారంగా తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ ప్రయోజనం పొందేందుకు అర్హులు కారని గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ బి.ఎం. నివేదిక సమర్పించారు.
గిరిజన సంక్షేమ శాఖ 37 మంది అభ్యర్థుల ఎస్టీ ధ్రువపత్రాలు, కుటుంబ నేపథ్యం, వలస వివరాలను పరిశీలించింది. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కొందరు తెలంగాణలో ఎస్టీ ధ్రువపత్రాలు పొందినప్పటికీ.. వారి కుటుంబ మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు ధ్రువపత్రాలు, కుటుంబ వివరాల పరిశీలనలో తేలిందని శాఖ తెలిపింది.
అభ్యర్థుల అర్హతపై సుప్రీంకోర్టు 1990 మే 2న W.P.(Civil) No.989 of 1989లో ఇచ్చిన తీర్పును గిరిజన సంక్షేమ శాఖ ప్రస్తావించింది. ఒక రాష్ట్రంలో షెడ్యూల్డ్ ట్రైబ్‌గా గుర్తింపు ఉన్న వ్యక్తి మరో రాష్ట్రానికి వలస వెళితే.. అక్కడ అదే ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రయోజనాలు పొందలేరన్న న్యాయ సూత్రాన్ని నివేదికలో పేర్కొంది.
అదే సమయంలో రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 95ను కూడా శాఖ ప్రస్తావించింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విద్యా రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను పరిశీలించినట్లు తెలిపింది. తెలంగాణలో రిజర్వేషన్ ప్రయోజనాల అర్హతకు సంబంధించి హైకోర్టు తీర్పులను కూడా నివేదికలో ఉదహరించింది.
నివేదికలో చావన్ సాహితి, కే.సీ. ప్రతిభాబాయి, తుకారాం జాదవ్, మీనా రాజు చావన్, హోంగుతి ధేవ్యాని అన్నయ్య, పవార్ ప్రీతి, ఆకాష్ దత్తా, నికితా చావన్, రాథోడ్ అభిలాష తదితరుల వివరాలను నమోదు చేశారు. ఆయా అభ్యర్థుల కుటుంబాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చినట్లు ధ్రువపత్రాల పరిశీలనలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ నుంచి సెప్టెంబర్ 22న అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 37 మంది అభ్యర్థులను ఎస్టీ కేటగిరీలో పరిగణించకుండా ఓపెన్ కేటగిరీలో వారి అర్హత, మెరిట్ ఆధారంగా పరిగణించాలని సెప్టెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ 37 మందిలో ఇప్పటికే తొమ్మిది మందికి ఎంబీబీఎస్ సీట్లు ఎస్టీ కోటాలో కేటాయించారు. వారిలో బుక్కే విశ్రుత్, ఎరుకుల హేమద్రి, నేవనాథ్ కోవిదా, మాలే సాయి హర్షిణి, కాకి నాగశయన, శంకరపురం రాచన, దేవరసెట్టి నిహాల్ సిద్ధార్థ్, వడితే చంద్ర హర్షిణి, ఎం.గాయత్రి చౌహాన్ ఉన్నారు. మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌లో వారికి కేటాయించిన సీట్లను వర్సిటీ రద్దు చేసింది.
రద్దైన సీట్లను ఖాళీ సీట్లుగా పరిగణించి మూడో దశ/మాప్-అప్ కౌన్సెలింగ్‌లో వర్తించే నిబంధనలు, మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు కేటాయించనున్నట్లు కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది. దీంతో ఎస్టీ కేటగిరీలో సీట్ల కేటాయింపుపై రాష్ట్రంలో మరోసారి అర్హత నిబంధనలపై చర్చ మొదలైంది.