హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి జి. రవి (2015 బ్యాచ్)ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (ఎస్పీఎల్-ఏ) సెప్టెంబర్ 26న జీవో ఆర్టీ నంబర్ 1409ను విడుదల చేసింది.
ప్రస్తుతం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్న జి. రవిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శిగా బదిలీ చేసి నియమించారు.
ఇప్పటివరకు టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి పదవికి ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్)లో ఉన్న బి. విజియేంద్ర, ఐఏఎస్ (2006 బ్యాచ్)ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
టీజీపీసీబీలో ఎఫ్ఏసీ బాధ్యతలు
జి. రవి బదిలీ అయినప్పటికీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ పదవిని పూర్తిగా ఖాళీ చేయలేదు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ పోస్టుకు ఆయనను ఎఫ్ఏసీలో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే జి. రవి కొత్తగా టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ బాధ్యతలను కూడా అదనంగా నిర్వహించనున్నారు.
ఈ మేరకు గవర్నర్ పేరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.