Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

నగరాల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు!

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 17, 2026 · 1 month క్రితం
◉ 7 Views ↗ 1 Shares
పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతానికి నిర్మలా సీతారామన్‌ పిలుపు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):

దేశంలోని నగరాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను సమన్వయంతో వినియోగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం, అభివృద్ధి ఆర్థిక వనరులను సమీకరించడం, ప్రైవేటు మూలధనాన్ని భాగస్వామ్యం చేయడం కీలకమని చెప్పారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాంకు–అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సమావేశాల సందర్భంగా భారత పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై ఆమె ప్రసంగించారు.

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

పట్టణ సవాళ్ల నిధి (అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌) కింద కేంద్రం రూ.లక్ష కోట్ల సహాయాన్ని అందించనుందని, దీని ద్వారా మొత్తం రూ.4 లక్షల కోట్ల పట్టణ పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యమని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నిధుల కోసం నగరాలు పోటీ విధానంలో ఎంపికవుతాయని, ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల పరిశీలనతో పాటు పాలన, పట్టణ ప్రణాళిక, మున్సిపల్‌ ఆర్థిక సంస్కరణలకు కట్టుబాటును పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.

అమృత్‌, స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ వంటి పథకాల ద్వారా గత ఎనిమిది నుంచి తొమ్మిదేళ్లలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునికీకరణకు ఊతమిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థల భాగస్వామ్యంతో తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర ప్రాథమిక సేవలను మెరుగుపరిచే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన ‘సిటీ ఎకనామిక్‌ రీజియన్‌’ విధానం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ విధానం కింద ఒక్కో నగర ఆర్థిక ప్రాంతానికి ఐదేళ్లలో రూ.5,000 కోట్ల చొప్పున సవాళ్ల ఆధారిత ఎంపిక, సంస్కరణలు–ఫలితాల ఆధారిత నిధుల కేటాయింపును ప్రతిపాదించారు. ప్రాంతీయ ప్రణాళికతో భూమి వినియోగ సామర్థ్యం పెరగడం, మౌలిక సదుపాయాల పునరావృత నిర్మాణం తగ్గడం, నిర్వహణ బాధ్యతల్లో స్పష్టత రావడం సాధ్యమవుతుందని వివరించారు.

ప్రజలకు ప్రాథమిక సేవలు అందించడంలో ప్రభుత్వ పెట్టుబడులు కీలకమని, వాటికి అదనంగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేలా ప్రాజెక్టులను రూపొందించాలని నిర్మలా సీతారామన్‌ సూచించారు. సాంకేతికంగా పటిష్ఠమైన ప్రణాళికలు, వాస్తవిక డిమాండ్‌ అంచనాలు, ప్రాజెక్టు జీవితకాల వ్యయాల లెక్కలు, పారదర్శక టెండర్లు, అమలు వ్యవస్థలు ఉండాలని చెప్పారు. పట్టణ ప్రాజెక్టుల తయారీ, అధికారుల సామర్థ్యాభివృద్ధికి అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ తోడ్పడుతుందని, లక్షలోపు జనాభా ఉన్న అర్హ పట్టణ స్థానిక సంస్థలకు రుణాలు అందుబాటులోకి తెచ్చేందుకు రూ.5,000 కోట్ల రుణ చెల్లింపు హామీ ఉపపథకాన్ని కూడా రూపొందించినట్లు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram