లక్ష ఉద్యోగాల భర్తీయే లక్ష్యం
అచ్చంపేట : వచ్చే ఏడాది కాలంలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఉద్యోగాల నియామక లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు కొత్తగా 4.89 లక్షల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అచ్చంపేట నియోజకవర్గంలో రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 75 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి త్వరలోనే నియామకాల ప్రక్రియ చేపడతామన్నారు. పాలమూరు ప్రాంతంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా జలాలను రైతుల పొలాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. అచ్చంపేట, నల్లమల ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, కులగణన ప్రక్రియలను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కుటుంబ బీమా, రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల రుణ అనుసంధానంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు.






