రెండు కార్లు ఢీ.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!
రామాయంపేట, నవంబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ సమీపంలోని NH-765DG ఫ్లైఓవర్ వద్ద గురువారం ఉదయం రెండు కార్లు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు (TS 16 FK 0599), సిద్ధిపేట నుంచి మెదక్ వైపు వస్తున్న హ్యుందాయ్ ఐ10 కారు (AP 28 DH 4311) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు, స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. నిత్యం వాహనాల రద్దీ ఉండే జాతీయ రహదారిపై వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.






