Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నేర వార్తలు

ఏసీబీ ట్రాప్‌.. మెట్‌పల్లి సీడీపీవో అరెస్ట్‌ రూ.63 వేల లంచం తీసుకుంటూ సీడీపీవో అరెస్ట్‌!

అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో అనుకూలంగా వ్యవహరించేందుకు డబ్బులు డిమాండ్‌? మెట్‌పల్లిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కరీంనగర్‌ ఏసీబీ అధికారులు
SAI MANIKANTA
September 26, 2026 · 3 days క్రితం
◉ 89 Views ↗ 1 Shares

జగిత్యాల, సెప్టెంబర్‌ 26 (నవజ్యోతి ప్రతినిధి): రూ.63 వేల లంచం తీసుకుంటున్న మెట్‌పల్లి సీడీపీవో దరోజు పద్మను కరీంనగర్‌ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెట్‌పల్లి అర్బన్‌ మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమె లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఏసీబీ ప్రెస్‌నోట్‌ ప్రకారం.. మెట్‌పల్లి అర్బన్‌ మండలంలో మొత్తం 21 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు కలిపి మొత్తం రూ.63 వేల లంచాన్ని డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు ట్రాప్‌ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి సీడీపీవో పద్మ నేరుగా రూ.63 వేల నగదు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆమె వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం సీడీపీవో పద్మను అరెస్టు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఆమెను కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాలతో అధికారులు వెల్లడించలేదు.

లంచం డిమాండ్‌ చేస్తే.. 1064కు ఫిర్యాదు:
ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేసినా, అవినీతికి పాల్పడుతున్నట్లు అనిపించినా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram