పేదల ప్లాట్లపై రోడ్ల నిర్మాణమా?.. మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం
– అక్రమ కట్టడాలను తొలగించి బాధితులకు న్యాయం చేయాలి : వేణుమాధవ్
సదాశివపేట : సదాశివపేట మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులోని హనుమాన్ నగర్లో పేదలకు చెందిన ప్రైవేట్ ప్లాట్లను ఆక్రమించి రోడ్లు నిర్మిస్తున్నారంటూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ 1982లో ఏర్పాటు చేసిన హనుమాన్ నగర్ వెంచర్లో అప్పట్లో 12 అడుగుల రోడ్డు ఉండగా, ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ పేరుతో 20 అడుగుల రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేద కుటుంబానికి చెందిన 68వ నంబర్ ప్లాట్‌ను పూర్తిగా రోడ్డుగా మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్వే నంబర్ 489 పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించకుండా పేదల స్థలాలపై దృష్టి సారించడం అన్యాయమన్నారు. మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టే ముందు పూర్తిస్థాయి సర్వే నిర్వహించి యజమానులకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించి బాధితుల ఆస్తులను రక్షించాలని కోరారు. అధికారుల తప్పిదాలు నిర్ధారణ అయితే బాధ్యులపై సస్పెన్షన్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక కౌన్సిలర్ కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని వేణుమాధవ్ కోరారు.






