పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. పెండింగ్ కేసులపై ఆరా!
జుక్కల్, నవంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): జిల్లా పోలీస్ శాఖ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించే క్రమంలో ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదివారం జుక్కల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ పనితీరు, సిబ్బంది విధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ నేరస్తులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీసుల సేవలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్, జుక్కల్ ఎస్ఐ మురళి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






