Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

మేడిగడ్డ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ ప్రచారం అవాస్తవం!

కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుంటే కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
November 3, 2026 · 4 weeks క్రితం
◉ 93 Views ↗ 2 Shares

కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుంటే కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలు
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందం

ఉమ్మడి నిజామాబాద్/ జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 3 (నవజ్యోతి ప్రతినిధి):

మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా దెబ్బతిన్నదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా రైతుల పంటలు ఎండిపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రాణహిత-గోదావరి సంగమం, కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ వద్ద పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం నేతలు బ్యారేజీని పరిశీలించి మీడియాతో మాట్లాడారు.

85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయి: ప్రశాంత్ రెడ్డి

మేడిగడ్డ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయని, గతంలో వచ్చిన భారీ వరదలను బ్యారేజీ తట్టుకుందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నపాటి మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

గోదావరి జలాలను వినియోగించుకోవాలి!

22,000
రోజువారీ క్యూసెక్కుల ప్రవాహం (సుమారు)
90 రోజులు
రోజుకు ఒక టీఎంసీ పంపింగ్‌తో ఎస్సారెస్పీకి నీరు
18 TMC
నిజాంసాగర్ సామర్థ్యం

ప్రస్తుతం రోజుకు సుమారు 22 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు దిగువకు వెళ్తున్నాయని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు పంపింగ్ చేస్తే ఎస్సారెస్పీని, అర టీఎంసీ చొప్పున 45 రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం కలిగిన నిజాంసాగర్‌ను నింపవచ్చని వివరించారు.

గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి లిఫ్టుల కింద నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డను నిర్వీర్యం చేస్తున్నారు: పుట్ట మధూకర్

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేకూర్చేలా మేడిగడ్డను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో భూగర్భ జలాలపై ప్రభావం పడుతోందన్నారు.

రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు: బాజిరెడ్డి

మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కూడా ప్రశ్నలు సంధించారు.

సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలి: గణేష్ బిగాల

మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ మేడిగడ్డపై గతంలో చేసిన ప్రచారానికి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుంటే రైతు పోరుబాట!

ఇప్పటికైనా ప్రభుత్వం కన్నెపల్లి పంపులను ప్రారంభించి గోదావరి జలాలను ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌కు తరలించాలని, లేనిపక్షంలో కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగంతో కలిసి భారీ స్థాయిలో ‘రైతు పోరుబాట’ చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

పరిశీలనలో పాల్గొన్న నేతలు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జజాల సురేందర్, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, నాయకులు ముజీబుద్దీన్, విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయి పర్యటనలో ప్రధానంగా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలు
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల పరిశీలన

నవజ్యోతి తెలుగు డైలీ
ప్రజా సమస్యలు • రాజకీయ పరిణామాలు

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram