Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

జనవరి 31 వరకు నిరసనలు వాయిదా వేయండి!

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 17, 2026 · 1 month క్రితం
◉ 4 Views ↗ 1 Shares
మోదీ, రాహుల్‌, కేజ్రీవాల్‌కు ఢిల్లీ వ్యాపార సంఘాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ నిరసనలను 2027 జనవరి 31 వరకు వాయిదా వేయాలని భారతీయ ఉద్యోగ్‌ వ్యాపార్‌ మండల్‌ (బీయూవీఎం) ఢిల్లీ విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు లేఖలు రాసింది. నిరసనలకు వ్యతిరేకంగా కాకుండా వ్యాపారాలు, ఉపాధి, ప్రజా రవాణా, సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు సంఘం స్పష్టం చేసింది.

రోజుకు కోట్ల రూపాయల నష్టం!

నవరాత్రులు, దీపావళి, గురుపురబ్‌, క్రిస్మస్‌తో పాటు పెళ్లిళ్ల సీజన్‌ వ్యాపారులకు, కార్మికులకు అత్యంత కీలకమని వ్యాపార సంఘం పేర్కొంది. వరుస నిరసనలు, ట్రాఫిక్‌ ఆంక్షలు, రహదారుల దిగ్బంధంతో మార్కెట్లకు చేరుకోవడం కష్టమవుతోందని, సరుకుల రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపింది. వ్యాపారాలకు రోజూ కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ పరిస్థితులతో ఉద్యోగుల జీతాలు చెల్లించడం, దుకాణాల అద్దెలు, ఇతర ఖర్చులు భరించడం కూడా కొన్ని సంస్థలకు కష్టంగా మారుతోందని సంఘం వివరించింది. మెట్రో స్టేషన్ల మూసివేతలు, మార్గాల మళ్లింపులు, భారీ ట్రాఫిక్‌ రద్దీ కారణంగా సోనిపట్‌, పానిపట్‌, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, నోయిడా, ఘజియాబాద్‌ నుంచి ఢిల్లీ మార్కెట్లకు వచ్చే కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

ఢిల్లీలో సుమారు 10 లక్షల వాణిజ్య సంస్థలతో పాటు పండుగల సమయంలో వేలాది తాత్కాలిక దుకాణాలు, చిన్న వ్యాపారాలు కార్యకలాపాలు నిర్వహిస్తాయని బీయూవీఎం తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఢిల్లీ మార్కెట్ల నుంచి సరుకులు సరఫరా అవుతాయని, ఇక్కడ వ్యాపారాలకు అంతరాయం ఏర్పడితే దేశవ్యాప్త వాణిజ్య వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. పండుగల సమయంలో కోల్పోయే వ్యాపారం, ఉపాధి అవకాశాలను తర్వాత భర్తీ చేయడం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రధాని మోదీ సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి సమన్వయం సాధించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యాపార సంఘం కోరింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవిస్తున్నామని రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌కు రాసిన లేఖల్లో పేర్కొంటూనే, జనవరి 31 వరకు ఆందోళనలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత కూడా మార్కెట్లు, ట్రాఫిక్‌, ప్రజలు, సరుకు రవాణాకు ఆటంకం కలగని నిర్దేశిత ప్రాంతాల్లోనే నిరసనలు నిర్వహించాలని సూచించింది.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్ష నేతలు, ఇండియా కూటమి పార్టీలు, కార్యకర్తలు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వ్యాపార సంఘం ఈ విజ్ఞప్తి చేసింది. నిరసనల ద్వారా యువతను అశాంతికి ప్రేరేపిస్తున్నారని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలపై ఆరోపించగా, ఆ ఆరోపణలను ప్రతిపక్షం ఖండించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష బాధ్యత అధికార పక్షాన్ని ప్రశ్నించడం, తప్పులను ఎత్తిచూపడం, అధికారంలో నుంచి తొలగించేందుకు పోరాడటమని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram