Saturday, November 28, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పథకం విద్యార్థుల కోసం సెంట్రల్‌ కిచెన్లు!

నవంబర్‌ 30లోగా నిర్మాణాలు పూర్తి - డిసెంబర్‌ 9న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 2, 2026 · 2 months క్రితం
◉ 23 Views ↗ 1 Shares
హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (నవజ్యోతి ప్రతినిధి):

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించేందుకు నాగర్‌కర్నూల్‌ – వికారాబాద్‌ జిల్లాల్లో ఆధునిక సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు హరే కృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అల్పాహార పథకం కోసం జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చైన్‌ ల్యాబ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు హరే కృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.

రూ.9.17 కోట్ల ఆర్థిక సహాయం:
నాగర్‌కర్నూల్‌ సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ కోసం జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5.17 కోట్ల చెక్కును అందించింది. వికారాబాద్‌లో కిచెన్‌ నిర్మాణానికి చైన్‌ ల్యాబ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించింది.

సంస్థల ప్రతినిధులను అభినందించిన సీఎం

నాగర్‌కర్నూల్‌ కిచెన్‌ కోసం జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఎండీ శేఖర్‌ రెడ్డి, సీఈవో అనిల్‌ బాబు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు. వికారాబాద్‌ కిచెన్‌ కోసం చైన్‌ ల్యాబ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి సమంత డే, వైస్‌ ప్రెసిడెంట్‌ బుగత సంతోష్‌ కుమార్‌ రూ.4 కోట్ల చెక్కును అందించారు. నిధులు అందించిన సంస్థల ప్రతినిధులను సీఎం అభినందించారు.

విద్యార్థుల ఆరోగ్యం – విద్యా పురోగతిపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ట్రాక్‌ రికార్డును నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు యాప్‌లను వినియోగించాలని సూచించారు.

అల్పాహారం అందించడం వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలలకు చేరుకునే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఆహార నాణ్యత విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ప్రాంతాల వారీగా అక్కడి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేయాలని సూచించారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం:
సెంట్రల్‌ కిచెన్లను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని సీఎం తెలిపారు. ఇది జీవితకాలం కొనసాగాల్సిన కార్యక్రమమని, అందువల్ల ప్రతి దశలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

డిసెంబర్‌ 9న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం

సెంట్రల్‌ కిచెన్ల నిర్మాణాలను నవంబర్‌ 30లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్‌ 9న రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్‌ కిచెన్లను ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సెంట్రల్‌ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌, హరే కృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్‌ స్వామీజీ పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram