₹2,000కు మించిన నిర్దిష్ట యూపీఐ పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తదితర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ ఎండీఆర్ విధానానికి చట్టపరమైన, విధానపరమైన ప్రాతిపదిక ఏమిటో అఫిడవిట్ ద్వారా వివరించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడాన్ని సవాల్ చేసిన పిటిషన్‌లో తగిన చట్టపరమైన రక్షణలు, పారదర్శకత, ప్రజా సంప్రదింపులు లేకుండానే ఈ విధానాన్ని తీసుకొచ్చారని పిటిషనర్ వాదించారు. ₹2,000కు మించిన మర్చంట్ చెల్లింపులపై ఎండీఆర్ విధించే నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు.
కొత్త విధానం ప్రకారం సాధారణ P2M యూపీఐ లావాదేవీల్లో ₹2,000కు మించిన చెల్లింపులపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. ₹75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా ₹300 పరిమితి ఉంటుంది. ₹2,000 వరకు యూపీఐ చెల్లింపులు, పర్సన్-టు-పర్సన్ (P2P) లావాదేవీలు మాత్రం ఉచితంగానే కొనసాగుతాయి.
నెలకు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ.1 లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారులకు కూడా ఎండీఆర్ నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం వంటి కొన్ని కీలక రంగాల్లో ₹2,000కు మించిన లావాదేవీలపై ఎండీఆర్ ఒక్కో లావాదేవీకి ₹5కు పరిమితం అవుతుందని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ వెంకటరామన్ కోర్టుకు వివరించారు.
కొత్త విధానంలో గేట్‌వేల ద్వారా జరిగే లావాదేవీల్లో సుమారు 96 శాతం ఎండీఆర్ పరిధిలోకి రావని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది పన్ను లేదా ప్రభుత్వ రుసుము కాదని, చెల్లింపుల వ్యవస్థలో పాల్గొనే సంస్థల మధ్య పంచుకునే సెటిల్‌మెంట్ ఛార్జీ అని వివరించారు. అయితే ఈ వివరాలను అఫిడవిట్‌లో సమర్పించాలని సీజేఐ సూర్యకాంత్ సూచించారు. ఈ అంశం ప్రధానంగా సాంకేతిక స్వభావం కలిగినదిగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి ఎండీఆర్ విధించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్న పరిధిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది ఫీజు కాదని కేంద్రం చెబుతున్నప్పుడు, అసలు ఈ రుసుము స్వభావం ఏమిటని ప్రశ్నించారు. డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలకు కూడా వ్యయం ఉంటుందని, యూపీఐ వ్యవస్థ కూడా అందుకు భిన్నం కాదని కేంద్రం తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. కేసుపై తదుపరి విచారణలో కేంద్రం అఫిడవిట్ సమర్పించిన తర్వాత అంశాలను కోర్టు పరిశీలించనుంది.