Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మేడ్చల్ మల్కాజిగిరి

కుళ్లిన పండ్లతో జ్యూస్‌.. ఆరోగ్యంతో చెలగాటమా?

వాసన వస్తోందని ప్రశ్నిస్తే.. “అందరూ ఇదే తాగుతారు” అంటూ సమాధానం? ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదంటున్న కస్టమర్‌
SAI MANIKANTA
September 26, 2026 · 3 days క్రితం
◉ 83 Views ↗ 2 Shares

కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 26 (నవజ్యోతి ప్రతినిధి): జ్యూస్‌ అంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందనే భావన ఉంటుంది. అయితే కుళ్లిపోయిన పండ్లతో జ్యూస్‌ తయారు చేసి విక్రయిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని సూరారం డివిజన్‌లో మల్లారెడ్డి హాస్పిటల్‌ సమీపంలోని రాఘవేంద్ర హోటల్‌ ఎదుట ఉన్న రాఘవేంద్ర ఫ్రూట్‌ జ్యూస్‌ పాయింట్‌పై ఓ కస్టమర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కుళ్లిపోయిన గ్రేప్స్‌తో జ్యూస్‌ తయారు చేసి విక్రయిస్తున్నారని, జ్యూస్‌లో వాసన రావడంతో సిబ్బందిని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు.

జ్యూస్‌ నాణ్యతపై ప్రశ్నించగా సంబంధిత వ్యక్తి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కస్టమర్‌ ఆరోపించారు. “అందరూ ఇదే తాగుతున్నారు” అంటూ సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఎంతమంది తాగుతున్నారన్నది కాకుండా.. ప్రజలకు అందిస్తున్న ఆహారం నాణ్యమైనదేనా? అన్నదే ముఖ్యమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

మల్లారెడ్డి హాస్పిటల్‌ సమీపంలోనే ఈ జ్యూస్‌ పాయింట్‌ ఉండటంతో పేషెంట్లు, వారి సహాయకులు కూడా అక్కడి నుంచి జ్యూస్‌ తీసుకునే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. కస్టమర్‌ చేసిన ఆరోపణలు నిజమైతే ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పందన కనిపించలేదని కస్టమర్‌ మీడియాకు తెలిపారు. ఫుడ్‌ స్టాల్‌లో తనిఖీలు నిర్వహించి ఉపయోగిస్తున్న పండ్ల నాణ్యత, జ్యూస్‌ తయారీ విధానం, నిల్వ పద్ధతులు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు.

ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల విషయంలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. కస్టమర్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అన్నది అధికారుల తనిఖీల్లోనే తేలాల్సి ఉంది. నిబంధనల ఉల్లంఘన ఉన్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారుల తనిఖీ అవసరం: కుళ్లిన పండ్ల వినియోగం, జ్యూస్‌ నాణ్యత, పరిశుభ్రతపై వచ్చిన ఆరోపణలు అధికారిక తనిఖీల ద్వారా నిర్ధారించాల్సి ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram