Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నేర వార్తలు

దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి!

భోజనం చేస్తుండగా ఒక్కసారిగా అద్దం పగిలిన వైనం.. కేసు నమోదు
SAI MANIKANTA
September 26, 2026 · 3 days క్రితం
◉ 18 Views ↗ 1 Shares
నాగ్‌పూర్‌, సెప్టెంబర్‌ 26 (నవజ్యోతి ప్రతినిధి): నాగ్‌పూర్‌-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటన కలకలం రేపింది. శుక్రవారం రాత్రి బోర్ఖేడి స్టేషన్‌ దాటిన అనంతరం గుర్తుతెలియని వ్యక్తి రైలు కిటికీలపై రాయి విసిరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఏ-1, బీ-2, బీ-5 కోచ్‌ల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు కూర్చున్న సమయంలో రాయి తాకడంతో అద్దం ఒక్కసారిగా పగిలి ముక్కలు లోపలికి ఎగిరిపడ్డాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదు.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఐదుగురు ప్రయాణికులు కలిసి కూర్చుని భోజనం చేస్తున్న సమయంలో కిటికీ అద్దం ఒక్కసారిగా పగిలిన దృశ్యం కనిపించింది. తాము నాగ్‌పూర్‌ నుంచి ముంబై వెళ్తున్నామని, భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా కిటికీ పగిలిందని ఓ ప్రయాణికుడు చెప్పడం వినిపించింది.

రాత్రి 8.27 గంటల సమయంలో బయట నుంచి రాయి లేదా ఏదైనా వస్తువు కిటికీలను ఢీకొట్టినట్లు ఎస్కార్ట్‌ సిబ్బంది, ప్రయాణికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) రాత్రి 8.46 గంటల ప్రాంతంలో గాలింపు చేపట్టారు.

బోర్ఖేడి-సింధి మధ్య 803 నుంచి 796 కిలోమీటర్ల పరిధిలోని రైల్వే ట్రాక్‌తో పాటు బోర్ఖేడి, బ్రహ్మణి గ్రామాల పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీస్‌ పాటిల్‌, స్థానికులను కూడా విచారించారు. అయితే అనుమానాస్పద వ్యక్తి లేదా ఘటనకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తిపై రైల్వే చట్టంలోని సెక్షన్‌ 153 కింద కేసు నమోదు చేశారు. శనివారం తెల్లవారుజామున 2.55 గంటలకు క్రైమ్‌ నంబర్‌ 325/2026గా కేసు నమోదైంది. రాయి ఎక్కడి నుంచి విసిరారన్నది నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram