ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పు చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నదని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనా ధర్మాసనం స్పష్టం చేసింది.
“ఎఫ్‌డీ పోయింది”.. జస్టిస్ బాగ్చీ వ్యాఖ్య
విచారణ సందర్భంగా జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ దానం నాగేందర్‌ను ఉద్దేశించి తేలికపాటి వ్యాఖ్య చేశారు. “ఎమ్మెల్యేగా మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంది.. ఎంపీగా షేర్ మార్కెట్‌లో ప్రయత్నించారు.. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ పోయింది” అని వ్యాఖ్యానించారు.
దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పార్టీ సభ్యత్వాన్ని వదిలిన సభ్యుడి చర్యను పార్టీ క్షమించే అవకాశం ఉందని ఆయన వాదించారు. దీనిపై జస్టిస్ బాగ్చీ “ఘర్ వాపసీ?” అంటూ మరోసారి తేలికపాటి వ్యాఖ్య చేశారు.
పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(బి)ను రోహత్గి ప్రస్తావించగా.. ఆ నిబంధన పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన సందర్భానికి మాత్రమే వర్తిస్తుందని, పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలేసిన అంశానికి సంబంధించిన పేరా 2(1)(ఎ)కు అది వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ బాగ్చీ సరదాగా “మీ కేసు ‘ఆయా రామ్.. గయా రామ్.. ఫిర్ ఆయా రామ్’ లాంటిదా?” అని వ్యాఖ్యానించారు. అయితే దానం నాగేందర్ చర్యలను బీఆర్‌ఎస్ క్షమించిందన్న వాదనను ఆ పార్టీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ దాఖలు చేసింది కూడా బీఆర్‌ఎస్ సభ్యుడేనని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
హైకోర్టు తీర్పులో జోక్యం లేదు
వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. దీంతో దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ అయింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటికి ఆయన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండటంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని పదో షెడ్యూల్ కింద అనర్హతకు గురయ్యారని హైకోర్టు నిర్ధారించింది.
దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తిరస్కరించగా.. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది.
2024 ఏప్రిల్ 23న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తేదీ నుంచే దానం నాగేందర్ అనర్హత అమల్లోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారినట్లు ప్రకటించి, ఎన్నికల సంఘానికి తదుపరి చర్యల కోసం తీర్పు ప్రతిని పంపాలని ఆదేశించింది. 1
ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికపైనే ఉత్కంఠ
సుప్రీంకోర్టు కూడా దానం నాగేందర్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానంపై తదుపరి ఎన్నికల ప్రక్రియకు మార్గం మరింత స్పష్టమైనట్లు తాజా పరిణామం సూచిస్తోంది.
కేసు: DANAM NAGENDER Vs ALLETI MAHESHWAR REDDY | SLP(C) No. 33735-33736/2026