యూఏఈలో భారతీయుడి మర్డర్ మిస్టరీ.. భార్య, కొడుకు మిస్సింగ్!
ఉడుపి, సెప్టెంబర్ 23 (నవజ్యోతి ప్రతినిధి): యూఏఈలోని షార్జాలో ఓ భారతీయుడి హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ (44) హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహం ఓ కారులో తొమ్మిది ముక్కలుగా లభించడం తీవ్ర సంచలనంగా మారింది. అంతకుమించి.. హత్య అనంతరం ఆయన భార్య టీనా, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ తెలియకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది. 2
అల్విన్ ప్రకాశ్ గత 14 ఏళ్లుగా షార్జా విమానాశ్రయంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్య టీనా కూడా షార్జాలోని ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. దంపతుల కుమారుడు అక్కడే 10వ తరగతి చదువుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో అల్విన్ స్వస్థలమైన కుందాపురకు వచ్చి తిరిగి షార్జా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 3
జూలై 20న అల్విన్ సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ ఆయనకు ఫోన్ చేశారు. అల్విన్ ఫోన్ ఎత్తకపోయినా.. తాను బాగానే ఉన్నానంటూ టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు అనిల్ తెలిపారు. సాధారణంగా వాయిస్ మెసేజ్‌ల ద్వారా మాట్లాడే అల్విన్ ఇలా టెక్స్ట్ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత కూడా ఆయన నుంచి స్పందన రాకపోవడంతో షార్జాలో ఉన్న అల్విన్ స్నేహితుడు మనోహర్‌ను సంప్రదించారు. 4
మనోహర్ అల్విన్ నివసించే కంపెనీ వసతి గృహానికి వెళ్లగా.. ఆయన భారత్‌కు వెళ్లిపోయారని వాచ్‌మన్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కంపెనీ హెచ్‌ఆర్ విభాగం కూడా తొలుత ఇదే సమాచారం ఇచ్చింది. అయితే అల్విన్ భారత్‌కు తిరిగి రాలేదని అనిల్ స్పష్టం చేయడంతో కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్ రికార్డులను పరిశీలించారు. అందులో అల్విన్ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 5
అనంతరం ఓమన్ వైపు వెళ్లే మార్గంలో పార్క్ చేసిన కారులో అల్విన్ మృతదేహం లభించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచినట్లు ఆయన సోదరుడు పేర్కొన్నారు. అనంతరం పోస్టుమార్టం, గుర్తింపు ప్రక్రియ ద్వారా మృతదేహం అల్విన్‌దేనని నిర్ధారించినట్లు సమాచారం. 6
ఈ కేసులో హత్యకు అసలు కారణం ఏమిటి? ఎవరు హత్య చేశారు? అల్విన్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? మృతదేహాన్ని ఓమన్ మార్గంలో ఉన్న కారులో ఎందుకు ఉంచారు? భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా లభించాల్సి ఉంది. షార్జా అధికారులు నిందితుల వివరాలు లేదా హత్యకు గల కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. 8
మరోవైపు అల్విన్ సోదరుడు అనిల్ ప్రశాంత్ కుందర్ ఉడుపి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం తీసుకుని కేసు దర్యాప్తులో సహకరించాలని కోరారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం అల్విన్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఉడుపి పోలీసులు కూడా షార్జా అధికారుల అధికారిక సమాచారాన్ని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. 9
సాధారణంగా కుటుంబంతో సంబంధాలు కొనసాగించే వ్యక్తి నుంచి అకస్మాత్తుగా స్పందన లేకపోవడం.. ఆ తర్వాత భారత్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం రావడం.. పాస్‌పోర్ట్ రికార్డుల్లో ఆయన షార్జాలోనే ఉన్నట్లు తేలడం.. చివరకు కారులో మృతదేహం లభించడం.. ఇప్పుడు భార్య, కుమారుడి ఆచూకీ లేకపోవడం వంటి పరిణామాలు ఈ కేసులో అనేక ప్రశ్నలను మిగిల్చాయి. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి అనుమానాన్ని వాస్తవంగా పరిగణించలేమని, హత్య వెనుక అసలు కారణం, నిందితుల వివరాలు అధికారిక దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.






