Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
ఆరోగ్యం

గ్రామీణ వైద్యానికి ఏఐ అండ.. ఆశా – అంగన్‌వాడీ సిబ్బందికి హెల్త్‌వాణి !

కృత్రిమ మేధస్సు (ఏఐ)
SAI MANIKANTA
September 22, 2026 · 1 week క్రితం
◉ 7 Views ↗ 1 Shares

గూగుల్‌ జెమినీ ఆధారంగా వాధ్వాని ఏఐ ‘హెల్త్‌వాణి’

స్థానిక భాషల్లో వైద్య సమాచారాన్ని అందించే సాంకేతికత
పోషణ్‌ ట్రాకర్‌లోనే అందుబాటులోకి.. త్వరలో 12 భాషల్లో సేవలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 (నవజ్యోతి ప్రతినిధి):

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు అందుబాటు ఇంకా సవాలుగా ఉన్న నేపథ్యంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతను ఆశా కార్యకర్తలు – అంగన్‌వాడీ సిబ్బందికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గూగుల్‌ – వాధ్వాని ఏఐ భాగస్వామ్యంతో రూపొందించిన ‘హెల్త్‌వాణి’ యాప్‌ ద్వారా ఫ్రంట్‌లైన్‌ ఆరోగ్య కార్యకర్తలకు ధృవీకరించిన వైద్య సమాచారాన్ని వారి భాషలో అందించే విధానం అమల్లోకి వస్తోంది.

దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా ఆశా – అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలకు కీలకంగా పనిచేస్తున్నారు. తల్లి – శిశు సంరక్షణ, టీకాలు, పోషణ, వ్యాధుల పర్యవేక్షణ, ప్రజారోగ్య కార్యక్రమాలతో పాటు ప్రాథమిక వైద్య మార్గదర్శకత్వంలో వీరి పాత్ర ఉంది.

హెల్త్‌వాణి యాప్‌ను ఇప్పటికే ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తల మొబైళ్లలో ఉన్న పోషణ్‌ ట్రాకర్‌తో అనుసంధానించారు. చిన్నారుల్లో పోషకాహార లోపం లక్షణాలను గుర్తించడం, సాధారణ అనారోగ్యాల నిర్వహణ, తల్లి – నవజాత శిశు ఆరోగ్యం, పోషణ వంటి అంశాలపై కార్యకర్తలు ప్రశ్నలు అడిగి సమాచారం పొందేలా దీనిని రూపొందించారు.

ఈ వ్యవస్థలో గూగుల్‌ జెమినీ ఫ్లాష్‌, జెమినీ ఎంబెడింగ్‌ మోడళ్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. కార్యకర్తలు వైద్యపరమైన క్లిష్టమైన పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేకుండా సాధారణ సంభాషణలోనే ప్రశ్న అడిగినా, ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సంబంధిత సమాచారాన్ని అందించేలా వ్యవస్థను రూపొందించినట్లు గూగుల్‌ ఇండియా ప్రతినిధులు తెలిపారు.

హెల్త్‌వాణి ప్రస్తుతం మరాఠీ, ఒడియా, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులో ఉందని, త్వరలో 12 భాషలకు విస్తరించనున్నట్లు వాధ్వాని ఏఐ తెలిపింది. స్థానిక భాషలు – మాండలికాల్లో వైద్య సమాచారాన్ని అందించడంలో భాషా వైవిధ్యం కీలకమైన అంశంగా పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మేఘాలయ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆశా కార్యకర్తలతో, ఒడిశా – మహారాష్ట్రలో అంగన్‌వాడీ కార్యకర్తలతో హెల్త్‌వాణి ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు వెల్లడించారు.

ఏఐ ఇచ్చే సమాధానాల వైద్యపరమైన ఖచ్చితత్వంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వాధ్వాని ఏఐ ప్రతినిధులు తెలిపారు. సమాధానాల కోసం ముందుగా ఎంపిక చేసిన, అధికారికంగా ధృవీకరించిన వైద్య పత్రాలు – సమాచారం – చిత్రాలు – పట్టికలను ఉపయోగించే విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. మానవుల పర్యవేక్షణ, పరీక్షలు, ఫీడ్‌బ్యాక్‌ విధానాల ద్వారా సమాధానాల నాణ్యతను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.

భారతదేశంలోని భాషా – సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐ వ్యవస్థలను రూపొందించాల్సిన అవసరం ఉందని గూగుల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతి లోబానా పేర్కొన్నారు. ఒకే విధమైన పరిష్కారం కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.

స్థానిక భాషలు – మాండలికాల కోసం గూగుల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌తో కలిసి ‘ప్రాజెక్ట్‌ వాణి’ ద్వారా 109 భాషలు – మాండలికాలకు సంబంధించిన మాట్లాడే భాష డేటాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. డిజిటల్‌ సదుపాయాలకు దూరంగా ఉన్న తక్కువ వనరుల భాషలకు కూడా ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు రోజువారీగా ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు తక్షణ మార్గదర్శకత్వం అందించడం మాత్రమే కాకుండా, పెద్ద సంఖ్యలో నమోదయ్యే ఆరోగ్య సంబంధిత ప్రశ్నలను విశ్లేషించడం ద్వారా వ్యాధుల వ్యాప్తి, కొత్త ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను గుర్తించడంలో కూడా ఏఐ భవిష్యత్‌లో ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఆరోగ్య రంగంతో పాటు వ్యవసాయం, విద్య వంటి రంగాల్లోనూ ఇలాంటి ఏఐ ఆధారిత నమూనాలను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని గూగుల్‌ – వాధ్వాని ఏఐ ప్రతినిధులు తెలిపారు. అయితే వైద్య రంగంలో ఏఐను ఉపయోగించేటప్పుడు ఖచ్చితమైన సమాచారం, మానవ పర్యవేక్షణ – అధికారిక వైద్య మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవస్థ పనిచేయడం కీలకమని వారు స్పష్టం చేశారు.

హెల్త్‌వాణి ప్రత్యేకతలు: ఏఐ ఆధారిత మార్గదర్శకత్వం • స్థానిక భాషలు • పోషణ్‌ ట్రాకర్‌ అనుసంధానం • ధృవీకరించిన వైద్య సమాచారం • మానవ పర్యవేక్షణ

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram