డ్రగ్స్ – నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై కొరడా!
గంజాయి రవాణా – అక్రమ మద్యం సరఫరా మార్గాలపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) – డ్రగ్స్ అక్రమ రవాణాపై భారీ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టాలని ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిని కలిపి క్యూర్ ప్రాంతంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తొలి మూడు నెలల్లో నమోదైన ఎక్సైజ్ నేరాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు.
అబ్కారీ భవన్లో సోమవారం జరిగిన సమావేశానికి ప్రొహిబిషన్ – ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ అధ్యక్షత వహించారు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో కలిసి క్యూర్ పరిధిలో నమోదైన కేసులు, ఎన్ఫోర్స్మెంట్ చర్యలను సమీక్షించారు. ఎన్డీపీఎల్తో పాటు ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదయ్యే డ్రగ్స్ కేసులపై చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఎక్సైజ్ నేరాలను నియంత్రించడంతో పాటు క్షేత్రస్థాయిలో నిఘాను పెంచాలని హరికిరణ్ సూచించారు. బార్లు – మద్యం దుకాణాల నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఎక్సైజ్ ఫీజు వాయిదాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా జూలై – ఆగస్టు నెలల్లో ఎన్డీపీఎల్, అక్రమంగా తయారు చేసే మద్యం, మాదకద్రవ్యాలపై చేపట్టిన చర్యల్లో 3,086 కేసులు నమోదు చేసి 2,707 మందిని అరెస్టు చేసినట్లు శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ చర్యల్లో 487 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల్లో సుమారు 872 కిలోల గంజాయిను పట్టుకోగా, దాని విలువ దాదాపు రూ.4 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలోకి ప్రవేశిస్తున్న అక్రమ మద్యం రవాణాపైనా ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచుతున్నారు. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా ఎన్డీపీఎల్ తరలిస్తున్న ఘటనలను అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ప్రైవేట్ బస్సులు – రైళ్లలో తనిఖీల సందర్భంగా 2,558 బాటిళ్ల ఎన్‌డీపీఎల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ పరిసరాల్లో గంజాయి రవాణాపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. సెప్టెంబర్ 21న మల్కాజిగిరి పరిధిలో రెండు కేసుల్లో 28.163 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఆగస్టులో నాచారంలో 3.270 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
క్యూర్ పరిధిలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగస్వామ్యం చేయాలని అధికారులు నిర్ణయించారు. అక్రమ మద్యం – డ్రగ్స్‌ను పట్టుకోవడమే కాకుండా వాటి మూలం, రవాణా మార్గాలు, సరఫరా నెట్‌వర్క్‌ను గుర్తించడంపై దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు.
మరోవైపు ఎక్సైజ్ ఉద్యోగుల ఆరోగ్య సహాయ పథకంపైనా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్య సహాయత పథకం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ నుంచి ప్రభుత్వ నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే 97 శాతం ఎక్సైజ్ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం కార్డులు అందినట్లు వెల్లడించారు.
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగుల కోసం ఆరోగ్య సహాయత కొనసాగుతుందని, ఆ సంస్థ నుంచి ఇద్దరు ఉద్యోగులను ఆరోగ్య సహాయత ట్రస్ట్ బోర్డు కమిటీలో చేర్చాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.






