Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
భక్తి

తిరుమల భక్తులకు రూ.2 లక్షల బీమా!

రూ.2 లక్షలు
SAI MANIKANTA
September 17, 2026 · 4 days క్రితం
22 Views 1 Shares

ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో ప్రతి భక్తుడికి లైఫ్‌ కవర్‌…తిరుమల – తిరుపతిని ప్రపంచ ఆధ్యాత్మిక – సేవా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు

తిరుమల, సెప్టెంబర్ 17 (నవజ్యోతి ప్రతినిధి):

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం కల్పించాలని
టీటీడీ నిర్ణయించింది. ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా
తిరుమలలో ఉండే సమయంలో భక్తుడు మరణిస్తే
రూ.2 లక్షలు
అందేలా ఉచిత లైఫ్‌ కవర్‌ కల్పించనున్నారు. భక్తుల భద్రత,
సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ తిరుమల – తిరుపతి అభివృద్ధికి పలు కీలక ప్రణాళికలను
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి భక్తుడికి ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో
బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు. ఆధార్‌ ఆధారిత
ఆన్‌లైన్‌ విధానంలో ఈ బీమా సౌకర్యాన్ని అందించనున్నట్లు చెప్పారు.
తిరుమలలో భక్తుడు సహజంగా మరణించిన సందర్భంలో అతని కుటుంబానికి
రూ.2 లక్షలు అందేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
టీటీడీ ఇప్పటికే ప్రమాదవశాత్తు మరణించే భక్తులకు అందించే బీమా మొత్తాన్ని
రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. సహజ మరణాలకు
ప్రత్యేక లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ
వెల్లడించింది.
చంద్రబాబు నాయుడు ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని టీసీఎస్‌ ట్రస్ట్‌
రూ.104 కోట్లతో నిర్మించింది. నాలుగు అంతస్తుల్లో 14 గ్యాలరీలు – 8,000కు పైగా
కళాఖండాలతో మ్యూజియాన్ని ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దారు. మరోవైపు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1లో ‘దుర్లభ దర్శన్‌’ పేరుతో హీలింగ్‌ అండ్‌
డివోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఏఐ – వీఆర్‌
సాంకేతికత ద్వారా శ్రీవారి వైభవాన్ని భక్తులకు పరిచయం చేయనున్నారు.
భక్తుల రవాణా సౌకర్యం కోసం రిలయన్స్‌ ఫౌండేషన్‌ 25 ఎలక్ట్రిక్‌ బస్సులు –
భారత్‌ బయోటెక్‌ ఫౌండేషన్‌ మరో ఏడు ఎలక్ట్రిక్‌ బస్సులను అందించాయి. దీంతో
టీటీడీ వద్ద ఉచిత ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య 50కి చేరింది. ఈ బస్సుల కోసం
ప్రత్యేక ఛార్జింగ్‌ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. పర్యావరణహితమైన
రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలోని 65 ఆలయాలు టీటీడీతో అనుబంధంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.
దేశంలో – విదేశాల్లో అధిక సంఖ్యలో హిందువులు నివసించే నగరాల్లో శ్రీవారి
ఆలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఇప్పటికే మారిషస్‌ – న్యూజిలాండ్‌
సహా పలు ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినట్లు
తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలను ఏర్పాటు
చేసే ప్రణాళిక ఉందన్నారు.
భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించే అన్నదానం ట్రస్ట్‌ వద్ద
రూ.3,165 కోట్లు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. భక్తులకు
అందించే అన్నప్రసాదం నాణ్యత – సేవలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించినట్లు
చెప్పారు.
టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను – తిరుపతిలోని ఇతర ఆసుపత్రులను
సమన్వయం చేసే ప్రతిపాదన ఉందని చంద్రబాబు తెలిపారు. వైద్యులు కూడా
‘శ్రీవారి సేవకులు’గా సేవలందించే అవకాశం కల్పించాలని ప్రభుత్వం
యోచిస్తున్నట్లు చెప్పారు.
తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి బస్టాండ్‌ వరకు స్కైవాక్‌ నిర్మించేందుకు
ప్రతిపాదన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును
చేపట్టనున్నట్లు చెప్పారు. ఇటీవల సేకరించిన 50 ఎకరాల భూమిలో బహుళ అంతస్తుల
పార్కింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీటీడీ ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 3,200 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
అందించేందుకు రూ.230 కోట్ల వ్యయంతో చర్యలు చేపట్టనున్నట్లు చంద్రబాబు
ప్రకటించారు. తిరుపతిలోని అన్ని ప్రధాన రహదారులను అనుసంధానం చేసేలా
చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
తిరుపతిని కేంద్రంగా చేసుకుని ఆర్థిక కార్యకలాపాలను విస్తరించాలని ప్రభుత్వం
భావిస్తోంది. భక్తులకు అవసరమైన సేవలు అందించే ప్రధాన సేవా కేంద్రంగా
తిరుపతిని తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబు
తెలిపారు.
తిరుపతిని ప్రముఖ వివాహ వేదికగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమాల నిర్వహణలో నెట్‌ జీరో విధానాలను పాటించాలని, సౌర – పవన
విద్యుత్‌తో పాటు బ్యాటరీ నిల్వ వ్యవస్థలను వినియోగించాలని యోచిస్తున్నారు.
తిరుమలలోని అన్ని టీటీడీ భవనాలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలని
ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. టీటీడీ ప్రస్తుతం సుమారు 10 కోట్ల
యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సుమారు 2,300 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమల ప్రపంచంలోనే ప్రముఖ ఆలయంగా
ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భక్తులకు సులభమైన దర్శనం, మెరుగైన
రవాణా – వసతి సౌకర్యాలు, ఆధునిక సాంకేతికత, పర్యావరణహిత చర్యలు,
ఆరోగ్య సేవలు – మౌలిక వసతుల అభివృద్ధితో తిరుమల – తిరుపతిని ప్రపంచ
ఆధ్యాత్మిక – సేవా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు
తెలిపారు.

“`1