జర్నలిస్టుల హక్కుల కోసం ..అక్టోబర్ 2 న గాంధీ జయంతి నాడు నిరసన !
ఆరు డిమాండ్లపై తక్షణ జోక్యం అవసరం
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి
సంగారెడ్డి, సెప్టెంబర్ 30 (నవజ్యోతి ప్రతినిధి) :
జర్నలిస్టుల హక్కులను సాధించడానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐజేయు) పిలుపుమేరకు అక్టోబర్ 2 న గాంధీ జయంతి నాడు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిరసన కార్యక్రమం చేపట్టినున్నట్లు టి యు డబ్ల్యూ జే సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ అనిల్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా విభాగం అధ్యక్షుడు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్ తెలిపారు. డిమాండ్స్ డే లో భాగంగా జాతిపిత గాంధీజీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి చెప్పారు.
ఇటీవల బెంగళూరు లో నిర్వహించిన ఐజేయు కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సమావేశం ఖండించిందని అన్నారు.
పెద్ద ఎత్తున నిరసన తెలిపాలని నిర్ణయించిందన్నారు. బెంగళూరు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి నాడు ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే ఫైసల్ తో పాటు జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొంటారని యాదగిరి అన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ కు, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు.
ప్రధాన డిమాండ్లు ఈ కింది విధంగా ఉన్నాయని వివరించారు.ముఖ్యంగా నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.మీడియా సిబ్బందికి రక్షణ కల్పించాలి.అందుకు ప్రత్యేక చట్టం తేవాలి.
రద్దు చేయబడిన చట్టాల స్థానంలో చట్టబద్దంగా హక్కులు పునరుద్ధరించాలి.
నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి.
రాష్ట్రంలో ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి.
జర్నలిస్టుల భద్రతా కోసం చట్టం తేవాలి అని యాదగిరి డిమాండ్ చేశారు. మీడియా నిపుణులు ఎదుర్కొంటున్న కీలకమైన నిర్మాణాత్మక చట్టపరమైన సమస్యలపై తక్షణం కేంద్రం జోక్యం కోరుతున్నామన్నారు. గౌరవనీయ రాష్ట్రపతి ఈ విషయంలో స్పందించాల్సిందిగా తమ సంఘం కోరుతుందన్నారు.పత్రికా స్వేచ్ఛను,మీడియా కార్మికుల సామాజిక-ఆర్థిక భద్రతను పరిరక్షించడానికి కీలకమైన ఆరు ముఖ్యమైన డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని యాదగిరి డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు, ఇళ్లస్థలాలు ఇవ్వాలి.
ఉద్యోగులకు ఇస్తున్న విధంగా హెల్త్ కార్డులు ఇచ్చి,క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని టీయూడబ్ల్యూజే కోరుతోందని యాదగిరి పేర్కొన్నారు.






