జాతీయ అథ్లెటిక్ మీట్‌కు జిల్లా జట్టు ఎంపిక పోటీలు
సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నవజ్యోతి ప్రతినిధి): 20వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్ కోసం సంగారెడ్డి జిల్లా జట్టు ఎంపిక పోటీలు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలో ఉత్సాహంగా జరిగాయి. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అండర్-14, అండర్-16 విభాగాల్లో సుమారు 600 మంది బాలబాలికలు పాల్గొన్నారు. 60 మీటర్లు, 600 మీటర్లు, లాంగ్ జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, ట్రయథ్లాన్, పెంటాథ్లాన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. సోహైల్ అలీ, కార్యదర్శి ఎం.డి. జావీద్ అలీ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు వి.రవి, కాసిని శ్రీకాంత్, జి.శ్రీనివాస్, ప్రమోద్ కుమార్, భాస్కర్, షరీఫ్‌తో పాటు కోచ్‌లు, పీఈటీలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల అనంతరం జాతీయస్థాయి NIDJAM పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.






