దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని సీఎం అధికారులను ప్రశ్నించారు. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి జీ-9 గ్రేడ్ బొగ్గు అవసరమని అధికారులు వివరించారు. అయితే సింగరేణిలో ప్రస్తుతం జీ-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ ఆ గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం లేదని వెల్లడించారు.
బొగ్గు లేని గ్రేడ్‌తో ప్లాంట్ నిర్మాణమా?
జీ-9 గ్రేడ్ బొగ్గు అందుబాటులో లేనప్పుడు ఆ సాంకేతికత ఆధారంగా యాదాద్రి థర్మల్ కేంద్రాన్ని ఎలా నిర్మించారని సీఎం, ఉప ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. పిట్‌హెడ్ వద్ద కాకుండా ప్లాంట్‌ను దూరంగా ఎందుకు నిర్మించారో, బొగ్గు సరఫరా వల్ల రాష్ట్రంపై పడుతున్న అదనపు భారం ఎంతనేది ఆరా తీశారు.
అప్పటి నిర్ణయాల నేపథ్యంలో పిట్‌హెడ్ వద్ద కాకుండా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను దూరంగా నిర్మించినట్లు అధికారులు సమావేశంలో వివరించారు. యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేయడం వల్ల తెలంగాణపై సుమారు రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు పేర్కొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సింగరేణి నుంచి జీ-9 గ్రేడ్ బొగ్గు లభించే అవకాశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి నుంచి జీ-9 గ్రేడ్ బొగ్గు సరఫరా చేయలేకపోయామని అధికారులు వివరించినట్లు వెల్లడించారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని కూడా అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి అవసరమైన బొగ్గును కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదే సమయంలో జీ-9 గ్రేడ్ బొగ్గు లభ్యత, సరఫరా మార్గాలు, వ్యయంపై తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.
సమావేశంలో ఎంపీ వేమ్ నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావుతో పాటు ఇంధన శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సింగరేణి కాలరీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.