Wednesday, September 30, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నేర వార్తలు

ఫోన్‌ కోసం దారుణం.. కర్రలతో దాడి చేసి హత్య!

సెల్‌ఫోన్‌ దొంగతనం చేశాడనే అనుమానంతో దాడి చేశారన్న కుటుంబ సభ్యులు పాత కక్షలే కారణమా?.. రాజకీయ అండదండలపై ఆరోపణలు
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
September 30, 2026 · 7 hours క్రితం
◉ 42 Views ↗ 1 Shares

తూప్రాన్‌, సెప్టెంబర్‌ 30 (నవజ్యోతి ప్రతినిధి): మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్‌పూర్‌ గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి రామానుజం (40)పై అదే గ్రామానికి చెందిన గుండెని ప్రవీణ్‌ కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్రలతో తీవ్రంగా కొట్టడంతో రామానుజం అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సెల్‌ఫోన్‌ దొంగతనం చేశాడనే అనుమానంతోనే రామానుజంపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం గ్రామంలో గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించిన ప్రవీణ్‌తో పాటు మరికొందరు రాత్రి సమయంలో రామానుజం ఇంటి వద్దకు వెళ్లినట్లు తెలిపారు. అనంతరం కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రామానుజం మృతి చెందినట్లు పేర్కొన్నారు.

సెల్‌ఫోన్‌ వివాదమే కారణమా?
మూడు రోజుల క్రితం ప్రవీణ్‌ తన సెల్‌ఫోన్‌ పోయిందంటూ వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆ ఫోన్‌ అనంతరం లభించినట్లు తెలిసింది. అయినప్పటికీ రామానుజమే ఫోన్‌ దొంగతనం చేశాడనే అనుమానంతో అతడిపై దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటన వెనుక పాత కక్షలు కూడా ఉండొచ్చన్న చర్చ గ్రామంలో జరుగుతోంది. హత్యకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. ఘటనకు దారితీసిన అసలు కారణాలు, దాడిలో పాల్గొన్న వారి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

సమాచారం అందుకున్న వెల్దుర్తి ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మృతుడు రామానుజానికి భార్య రజిత, తల్లిదండ్రులు సాయిలు, పోచమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram