సంవిధాన్ రక్షక్ ర్యాలీని విజయవంతం చేయాలి
భూదాన్ పోచంపల్లి : భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రేపు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంవిధాన్ రక్షక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన శిబిర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు లౌకికవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ప్రజలు, మేధావులు, యువత, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో జరిగే సంవిధాన్ రక్షక్ ర్యాలీకి భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భువనగిరి నియోజకవర్గ సమన్వయకర్త నమ్మిండ్ల శ్రీనివాస్, ఆలేరు నియోజకవర్గ సమన్వయకర్త కొండేటి మల్లయ్య, పురపాలక సంఘం చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






