వర్షపాతం, పంటలు, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, అక్టోబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి)
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి యోగితా రాణాను నియమించింది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా యోగితా రాణా వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు, తాగునీటి లభ్యతతో పాటు వ్యవసాయ, ఉద్యాన పంటల పరిస్థితులను సమీక్షించనున్నారు.
ముందస్తు చర్యలపై సమీక్ష
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, నీటి ఎద్దడి వంటి సమస్యలు తలెత్తే అవకాశాల నేపథ్యంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరా శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి చర్యలు తీసుకోనున్నారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలపై దృష్టి సారించనున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష నిర్వహించి, నీటి పొదుపు, పంటల పరిరక్షణ, విద్యుత్ సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడమే ప్రత్యేక పర్యవేక్షణ లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.