భిక్కనూర్, అక్టోబర్ 4 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బస్వాపూర్ గ్రామ శివారులో అయ్యోరు చెరువులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. రామాయంపేట మండలం ధమరచెరువుతండాకు చెందిన దేవ్‌సోత్ దేవుల (60) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన భార్య దేవ్‌సోత్ మారోని (సుమారు 55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
పిల్లల వివాహాలు, ఇటీవల ఇల్లు నిర్మించడంతో కుటుంబంపై ఆర్థిక భారం, అప్పులు పెరిగినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో భార్య ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె కోసం వెతికారు. ఈ క్రమంలో బస్వాపూర్ గ్రామ శివారులోని అయ్యోరు చెరువు వద్ద ఆమె చెప్పులు, దుస్తులు కనిపించడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు.
చెరువులో గాలించగా మృతదేహం
అనంతరం ఇతరుల సహాయంతో చెరువులో గాలించగా మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానసికంగా బాధపడుతూ ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన భార్య మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని దేవ్‌సోత్ దేవుల పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తులో భాగంగా సేకరిస్తున్నట్లు బిక్కనూర్ ఎస్‌ఐ ఎస్. అనిల్ తెలిపారు.