Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రైమ్

విలేఖరులమంటూ వడ్ల లారీ అడ్డగింత.. రూ.1.20 లక్షలు డిమాండ్‌!

ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున డిమాండ్‌.. కారు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం !
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
September 28, 2026 · 1 month క్రితం
◉ 244 Views ↗ 1 Shares

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 28 (నవజ్యోతి ప్రతినిధి):

వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని అడ్డగించి, తాము విలేకరులమంటూ డ్రైవర్‌ను బెదిరించి రూ.1.20 లక్షలు డిమాండ్‌ చేసిన నలుగురిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 26న రాత్రి 9.15 గంటల సమయంలో ఎల్లారెడ్డి మండలం మల్లాయిపల్లి సమీపంలోని ఎన్‌హెచ్‌-765(డీ)పై కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు లారీకి అడ్డంగా వాహనాన్ని నిలిపి డ్రైవర్‌ను ఆపారు.

తాము విలేకరులమంటూ లారీలో తరలిస్తున్న వడ్లకు సంబంధించిన పత్రాలు చూపించాలని డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నలుగురికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.1,20,000 ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని, పోలీసులకు అప్పగించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని డ్రైవర్‌ను బెదిరించినట్లు తెలిపారు.

యజమానినీ డబ్బులు ఇవ్వాలని బెదిరింపు
డ్రైవర్‌ లారీ యజమానికి సమాచారం ఇవ్వడంతో నిందితులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యజమానిని కూడా డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

డ్రైవర్‌ విషయాన్ని లారీ యజమాని సురేందర్‌ చకినాలాకు ఫోన్‌లో చెప్పడంతో ఆయన నిందితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా యజమానిని కూడా డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో యజమాని సూచన మేరకు డ్రైవర్‌ అక్కడి నుంచి లారీని తీసుకుని వెళ్లిపోయాడు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహ్మద్‌ అబ్దుల్‌ మోసిన్‌ (26), ఎడ్ల మహేశ్‌కుమార్‌ (29), బుడ్డే ఆనంద్‌ (37), గాండ్ల సుధీర్‌కుమార్‌ (34)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక కారు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

లారీలో సుమారు 300 క్వింటాళ్ల వడ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను ఆంధ్రప్రదేశ్‌లోని రైస్‌ మిల్లుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్‌ చంద్ర మాట్లాడుతూ.. వృత్తి లేదా హోదాను అడ్డుపెట్టుకున్నా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. తాము విలేకరులమంటూ ప్రజలను బెదిరించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram