Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రైమ్

అడవి పందుల అక్రమ రవాణా గుట్టురట్టు.. ఐదు వాహనాలు సీజ్!

మెదక్, అక్టోబర్ 11 (నవజ్యోతి ప్రతినిధి):
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 11, 2026 · 3 weeks క్రితం
◉ 554 Views ↗ 7 Shares
 

మెదక్, అక్టోబర్ 11 (నవజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో అడవి పందుల వేట, అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అడవి పందులను పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కస్టమర్ల ముసుగులో రంగంలోకి దిగిన అధికారులు శనివారం మెదక్ పట్టణంలోని జమ్మికుంట ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఐదు వాహనాలను సీజ్ చేసి పలువురిని విచారించారు.

ఐదు వాహనాలు సీజ్

సీజ్ చేసిన ఐదు వాహనాల్లో ఒకటి అశోక్ లేలాండ్ వాహనం కాగా, మిగిలినవి ద్విచక్ర వాహనాలని అధికారులు తెలిపారు.

నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు

మెదక్ పట్టణంలోని జమ్మికుంట ప్రాంతంతో పాటు పాపన్నపేట మండలం కొత్తపల్లి, అల్లాదుర్గం మండలం ముస్లాపూర్, మక్కరాజిపేట సమీపంలోని గోపాల్‌పూర్ ప్రాంతాల్లో అక్రమంగా అడవి పందులను పట్టుకుంటున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన సంపత్ ప్రధానంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పట్టుకున్న అడవి పందులను ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జమ్మికుంటకు చెందిన ముత్యాలు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

పలువురిని విచారించిన అధికారులు

రాజ్‌పల్లికి చెందిన అంజనేయులు సహా పలువురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. కొత్తపల్లికి చెందిన దుర్గయ్య, ముస్లాపూర్‌కు చెందిన నర్సింలు, ఈశ్వర్, గోపాల్‌పూర్‌కు చెందిన అశోక్, రమేష్ తదితరులను కూడా విచారించారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది.

రాత్రి ఒంటి గంటకు ఖననం పూర్తి

ఈ వ్యవహారంలో పట్టుబడిన నాలుగు అడవి పందులను ఖననం చేసే విషయంపై పశువైద్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖననం ప్రక్రియ చేపట్టగా, అది పూర్తయ్యే సమయానికి రాత్రి ఒంటి గంట అయింది. పశువైద్య శాఖ అధికారులు ఖననం సమయంలో ప్రత్యక్షంగా హాజరైనట్లు కాకుండా, వారికి సమాచారం అందించి ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రక్రియ పూర్తి చేసినట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి.

జేసీబీ, టిప్పర్ కూడా సీజ్

ఇదే ప్రాంతంలో ఇసుక నింపుతున్న జేసీబీ, టిప్పర్‌ను కూడా అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. అడవి పందుల వేట, రవాణా వ్యవహారంపై తనిఖీలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

డీఎఫ్‌ఓ జోజి హెచ్చరిక

“వన్యప్రాణుల వేటకు పాల్పడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం”

వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎఫ్‌ఓ జోజి తెలిపారు.

వన్యప్రాణుల సంరక్షణకు నిరంతర నిఘా అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అక్రమ వేట, రవాణా వెనుక ఉన్న వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

నవజ్యోతి తెలుగు డైలీ
వన్యప్రాణుల సంరక్షణ

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram