Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

కన్నుల పండువగా కామారెడ్డి గణేష్‌ నిమజ్జనం !

విద్యుద్దీపాల వెలుగులు.. డప్పుల మోతలు.. కోలాటాలతో మార్మోగిన వీధులు.. భక్తి పారవశ్యంలో గణనాథుడి శోభాయాత్ర
SAI MANIKANTA
September 24, 2026 · 6 days క్రితం
◉ 293 Views ↗ 6 Shares

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డిలో గణేష్‌ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో పట్టణంలోని ప్రధాన వీధులు భక్తి పారవశ్యంతో మార్మోగుతున్నాయి. రాత్రి వేళ రంగురంగుల విద్యుద్దీపాల వెలుగుల్లో సాగుతున్న గణనాథుడి శోభాయాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

డప్పు వాయిద్యాల మోతలు, భక్తుల జయజయధ్వానాలు, మహిళల కోలాటాలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. వివిధ ఆకృతుల్లో రూపొందించిన భారీ వినాయక విగ్రహాలను పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనాలపై ఏర్పాటు చేసి భక్తులు శోభాయాత్రగా తరలిస్తున్నారు.

ముఖ్యంగా సర్పాలపై ఆశీనుడై ఉన్న నీలిరంగు వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విగ్రహాన్ని చూసేందుకు పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణలతో శోభాయాత్రలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.

క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ
నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేష్‌ చంద్ర, డీఎస్పీ మధుసూదన్, మున్సిపల్ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌, సీఐ నరహరి తదితరులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పోలీసులు కూడా శోభాయాత్ర మార్గాల్లో విధులు నిర్వహిస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram