Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

కర్ణాటక ఎఫ్‌డీఏ చర్యలపై స్పందించిన ఫైజర్‌ ఇండియా!

నకిలీగా తయారైనట్లు అనుమానిస్తున్న బ్యాచ్‌లను మార్కెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి
SAI MANIKANTA
September 23, 2026 · 6 days క్రితం
◉ 4 Views ↗ 1 Shares

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (నవజ్యోతి ప్రతినిధి): నకిలీ మందుల వ్యవహారంపై కర్ణాటక ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఫైజర్‌ ఇండియా స్పందించింది. రోగుల భద్రత, ఔషధాల నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది. అధికారులు జరుపుతున్న దర్యాప్తుకు సహకరిస్తున్నామని తెలిపింది.

నకిలీ మందుల పంపిణీ, విక్రయానికి సంబంధించి కర్ణాటక ఎఫ్‌డీఏ 16 రిటైల్‌, హోల్‌సేల్‌ ఔషధ లైసెన్సులను రద్దు చేయగా.. మరో ఎనిమిది లైసెన్సులను సస్పెండ్‌ చేసింది. సస్పెండ్‌ చేసిన వాటిలో బెంగళూరులోని ఫైజర్‌ సి అండ్‌ ఎఫ్‌ డిపో లైసెన్స్‌ కూడా ఉంది. ఈ చర్యల నేపథ్యంలో ఫైజర్‌ తన వైఖరిని వెల్లడించింది.

తమ దృష్టికి ఈ విషయం వచ్చిన గత నెల రోజులుగా అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఫైజర్‌ ఇండియా తెలిపింది. నకిలీగా కాపీ చేసిన బ్యాచ్‌ నంబర్లతో ఉన్న తమ ఉత్పత్తులను గుర్తించి మార్కెట్‌ నుంచి తొలగించే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అసలైన ఉత్పత్తులు, నకిలీ ఉత్పత్తులను వేరు చేయడంలో అధికారులకు సహకరిస్తున్నామని, ప్రభావిత బ్యాచ్‌లకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని అందిస్తున్నామని వెల్లడించింది.

ప్రజారోగ్యాన్ని కాపాడటం, రోగుల భద్రతను నిర్ధారించడం, వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కొనసాగించడం తమ ప్రధాన లక్ష్యాలని ఫైజర్‌ పేర్కొంది. అధికారులతో సమన్వయం కొనసాగిస్తూ దర్యాప్తులో పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు సహకరిస్తామని తెలిపింది.

ఈ వ్యవహారం ఆగస్టు 18న బెంగళూరు దక్షిణ జిల్లా బిడాడి సమీపంలోని కురుబరకెరనహళ్లిలో ఒక ఫార్మ్‌హౌస్‌పై కర్ణాటక ఎఫ్‌డీఏ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నిర్వహించిన తనిఖీలతో వెలుగులోకి వచ్చింది. అక్కడ లైసెన్స్‌ లేకుండా మందులను రీప్యాకింగ్‌, రీలేబులింగ్‌ చేస్తున్నట్లు అధికారులు ఆరోపించారు. సుమారు రూ.5.05 కోట్ల విలువైన అనుమానాస్పద మందులు, యంత్రాలు, ప్రింటింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన మందులను కొత్త వయల్స్‌లో నింపి.. ఖరీదైన ప్రాణరక్షక మందుల పేర్లతో రీలేబులింగ్‌ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న కొన్ని ఉత్పత్తులపై ఫైజర్‌ బ్రాండ్‌కు సంబంధించిన నకిలీ లేబుళ్లు ఉన్నట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. వాటిపై ఉన్న క్యూఆర్‌, స్కానింగ్‌ కోడ్‌లు పనిచేయలేదని అధికారులు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న మందుల నమూనాలను ప్రయోగశాలలకు పంపించి వాటి రసాయన కూర్పు, స్టెరిలిటీ, ఔషధ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ కేసులో డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం-1940 కింద కేసు నమోదు చేశారు. నకిలీ మందుల సరఫరా వ్యవస్థ మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram